ఎమ్మెల్సీ ఓట్లను ఎలా లెక్కిస్తారో మీకు తెలుసా? రిజల్ట్స్‌ కోసం ఎందుకంత టైమ్‌ పడుతుందంటే..?

తెలంగాణలో ఇటీవల జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ గురించి చాలా మందికి సరైన అవగాహన ఉండదు. అసలు ఓట్లను ఎలా లెక్కిసారో అని డౌట్ ఉంటుంది. గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయుల నియోజకవర్గాలలో కోటా నిర్ధారణ, ఎలిమినేషన్ ప్రక్రియలను ఇప్పడు వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

ఎమ్మెల్సీ ఓట్లను ఎలా  లెక్కిస్తారో మీకు తెలుసా? రిజల్ట్స్‌ కోసం ఎందుకంత టైమ్‌ పడుతుందంటే..?
Mlc Counting

Edited By: SN Pasha

Updated on: Mar 02, 2025 | 8:38 PM

తెలంగాణలో ఇటీవలె ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్‌ జరిగింది. ఎప్పటిలాగే ఈసారి కూడా ఎన్నికలను బ్యాలెట్ పేపర్ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. తెలంగాణలో రెండు టీచర్స్, ఒక గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నిక నిర్వహించారు. ఈ ఓట్ల లెక్కింపు మార్చి3న ప్రారంభం కానుంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఫలితం వెలువడటానికి రెండు నుంచి మూడు రోజుల సమయం పట్టనుండగా.. టీచర్స్ ఎమ్మెల్సీ స్థానంలో ఫలితం సాయంత్రానికి వెలువడే అవకాశం ఉంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానంలో ఫలితం ఆసల్యంగా రావడానికి గల కారణాలు ఏమిటి.. అసలు ఎమ్మెల్సీ ఓట్లను ఎలా లెక్కిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం.

కోటా నిర్థారణ..
సాధారణ ఎన్నికల్లో ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. కానీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో చెల్లుబాటయ్యే ఓట్లలో 50 శాతానికి పైగా ఓట్లు సాధించిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపులో ముందుగా కోటాను నిర్ధారించాల్సి ఉంటుంది. పోలైన ఓట్లలో చెల్లని ఓట్లను తీసేసి, చెల్లుబాటయ్యే ఓట్ల లెక్క తేలుస్తారు. మొత్తం చెల్లుబాటయ్యే ఓట్లలో 50 శాతం లెక్కగడతారు. 50 శాతానికంటే ఒక్క ఓటు ఎక్కువుగా సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ముందుగా ఓట్లను కట్టలుకడతారు. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థుల కోసం ఒక్కోక్కరికి ఒక డబ్బా కేటాయించి వారు పొందిన ఓట్లను ఆ డబ్బాల్లో వేస్తారు. ఆ తర్వాత అభ్యర్థి సాధించిన ఓట్లను లెక్కగడతారు. ఉదాహరణకు మొత్తం 2వేల ఓట్లు పోలైతే వాటిలో 1800 ఓట్లు చెల్లుబాటైతే 901 ఓట్లు సాధించిన వ్యక్తి విజయం సాధిస్తారు. మొదటి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపు తర్వాత ఏ అభ్యర్థి 901 ఓట్ల కోటాను చేరుకోకపోతే ఎలిమినేషన్ ప్రక్రియ ప్రారంభిస్తారు.

ఎలిమినేషన్ ఎలా చేస్తారంటే..?
ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా అందరికంటే తక్కువ ఓట్లు సాధించిన వ్యక్తికి వచ్చిన ఓట్లలో రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. వాటిని పైనున్న అభ్యర్థులకు బదిలీ చేస్తారు. ఒక అభ్యర్థి ఎలిమినేషన్ తర్వాత కోటా ఓట్లు ఎవరికి రాకపోతే మరో అభ్యర్థిని ఎలిమినేట్ చేస్తూ.. కోటా ఓట్లు వచ్చే వరకు ఎలిమినేషన్ ప్రక్రియ కొనసాగిస్తారు. ఎప్పుడైతే విజయానికి అవసరమైన కోటా ఓట్లు అభ్యర్థి సాధిస్తారో అప్పుడు అతడిని విజేతగా ప్రకటిస్తారు. గ్రాడ్యుయేట్ ఓట్లు లక్షల్లో ఉండటం ద్వారా వాటి లెక్కింపు ప్రక్రియ ఆలస్యమవుతుంది. ఉపాధ్యాయుల ఓట్లు కేవలం వేల సంఖ్యలో మాత్రమే ఉండటంతో ఓట్ల లెక్కింపు త్వరగా పూర్తవుతుంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.