TRS vs Revanth: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నాలుక తెగ కోస్తాం.. రేవంత్‌రెడ్డికి తెలంగాణ మంత్రుల వార్నింగ్

|

Aug 10, 2021 | 5:31 PM

పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు.

TRS vs Revanth: ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నాలుక తెగ కోస్తాం.. రేవంత్‌రెడ్డికి తెలంగాణ మంత్రుల వార్నింగ్
Trs Ministers
Follow us on

Telangana Ministers: పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తెలంగాణ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, వేముల ప్రశాంత్ రెడ్డి ఘాటుగా స్పందించారు. తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు మాట్లాడారు. రేవంత్ భాషను తెలంగాణ ప్రజలు చీదరించుకుంటున్నారని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. పోడు వ్యవసాయంపై మాట్లాడే అర్హత మీకు లేదన్నారు. పోడు భూములపై హక్కు కల్పించడానికి సీఎం కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. రేవంత్ ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నాలుక తెగ కోస్తామన్నారు. రేవంత్‌ను తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని అన్నారు. పదవి వ్యామోం ఉంటే ప్రజలకు ఏం చేస్తావో చెప్పి మెప్పించాలని సూచించారు. వల్గర్ మాటలు మానుకోవాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి హితవు పలికారు.

మరో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు డైరెక్షన్‌లోనే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ఇప్పటికీ పనిచేస్తున్నారని ఆరోపించారు. 2004లో తెలంగాణ ఇస్తామంటేనే కాంగ్రెస్‌తో టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని గుర్తు చేసిన మంత్రి.. తెలంగాణ ప్రకటించిన సోనియాగాంధీ ఆ నిర్ణయాన్ని వెనక్కు తీసుకున్నారని ధ్వజమెత్తారు. 2004లో ఇస్తామన్న తెలంగాణ.. 2014లో సాకారమైందన్నారు. రాష్ట్రం ఏర్పాటుకు ఆలస్యం చేసిన పదేళ్ల కాలంలో ఎంతో మంది స్వరాష్ట్రం కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్నారని మండిపడ్దారు.

టీడీపీలో కొనసాగిన సమయంలో.. వందల మంది తెలంగాణ యువత చావులకు కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ కారణమని రేవంత్‌ రెడ్డి విమర్శించలేదా? అని మంత్రి ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డికి దెయ్యంలా కనిపించిన సోనియా గాంధీ ఇప్పుడు పార్టీ మారగానే దేవతలా కనిపిస్తున్నారా? అని ఎద్దేవా చేశారు. సోనియా గాంధీపై రేవంత్‌రెడ్డి చేసిన తీవ్ర వ్యాఖ్యలకు సంబంధించిన ఓ వీడియోను మంత్రి మీడియా ముందు ప్రదర్శించారు. పూటకో మాట.. పార్టీ మార్చే రేవంత్‌ రెడ్డి మాటలు నమ్మాలో.. వద్దో.. కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తలు నిర్ణయించుకోవాలన్నారు. 60 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ ఎస్సీల కోసం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. 60 ఏళ్ల కాలంలో ఒక్క ఎస్సీ నేతను ప్రధానిగా ఎందుకు చేయలేదని మంత్రి ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. స్వరాష్ట్రంలో దళితుల అభివృద్ధి దళిత బంధు పథకం అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని మంత్రులు గుర్తు చేశారు.


Read Also…  Gadari Kishore: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌ను విమర్శిస్తే ఊరుకోం.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు బెదిరింపు!