Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు భద్రత పెంపు.. హత్య కుట్ర కేసు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలనాలు!

|

Mar 04, 2022 | 4:40 PM

ఓ వైపు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సెక్యూరిటీ పెంపు.. ఇంకోవైపు కస్టడీ పిటీషన్‌పై విచారణ.. హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామాలుగా కనిపిస్తున్నాయి. తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మరింత భద్రత పెంచాలని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌ విభాగం నిర్ణయించింది.

Srinivas Goud: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు భద్రత పెంపు..  హత్య కుట్ర కేసు రిమాండ్‌ రిపోర్ట్‌లో సంచలనాలు!
Srinivas Goud
Follow us on

Telangana Minister Srinivas Goud: ఓ వైపు మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సెక్యూరిటీ(Security) పెంపు.. ఇంకోవైపు కస్టడీ పిటీషన్‌(Custody Petition)పై విచారణ.. హత్యకు కుట్ర కేసులో కీలక పరిణామాలుగా కనిపిస్తున్నాయి. తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు మరింత భద్రత పెంచాలని రాష్ట్ర ఇంటెలిజెన్స్‌(Intelligence) విభాగం నిర్ణయించింది. ఇటీవల హత్య కుట్రకోణం బయట పడటంతో ఆయనకు భద్రత కట్టుదిట్టం చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా రెండు పైలట్‌ వాహనాలు, 20 మందితో భద్రత కల్పించాలని సెక్యూరిటీ వింగ్ అధికారులను పోలీసు ఉన్నతాధికారులు ఆదేశించారు. మరోవైపు, నిందితుల రిమాండ్‌ రిపోర్ట్‌లోనే సంచలన నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఇక పోలీసులు నిందితుల్ని కస్టడీకి తీసుకుని విచారిస్తే ఇంకెన్ని విషయాలు బయటకు వస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.

హత్యకు కుట్ర కోణంతో.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు సెక్యూరిటీ పెంచాలని ఆదేశించింది తెలంగాణ ప్రభుత్వం. ఇకపై మంత్రి చుట్టూ 20 మంది భద్రతా సిబ్బంది ఉంటారు. గతంలో ఒక పైలెట్ సహా పది మంది సెక్యూరిటీ ఉండేది. ఇప్పుడు రెండు పైలెట్ వాహనాలతో భద్రత కల్పించాలని ప్రభుత్వం పోలీస్ శాఖను ఆదేశించింది. ప్రస్తుతం మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన హైదరాబాద్‌ వచ్చిన తర్వాత అదనపు భద్రతా సిబ్బంది విధుల్లో చేరనున్నారు. ఇదిలావుంటే, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హత్యకు రూ.15 కోట్ల డీల్‌ జరిగినట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. ఈ కేసులో ఎనిమిది మందిని అరెస్టు చేయడంతోపాటు రెండు ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో రాఘవేంద్రరాజు నేరాన్ని అంగీకరించాడని పోలీసులు తెలిపారు. వ్యాపారాలతో పాటు ఆర్థికంగా మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ తనను.. దెబ్బతీసినందునే హత్యకు పథకం వేశామని అంగీకరించాడని పోలీసులు తెలిపారు.

మరోవైపు మంత్రి హత్యకు కుట్ర కేసులో నిందితుల్ని కస్టడీకి తీసుకోవాలని భావిస్తున్నారు పోలీసులు. వారం రోజుల పాటు నిందితుల్ని కస్టడీకి ఇవ్వాలని ఇప్పటికే మేడ్చల్‌ కోర్టులో పిటిషన్ వేశారు. కోర్టు కస్టడీకి ఇస్తే వేర్వేరు కోణాల్లో విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. వ్యక్తిగత వైరమా..? లేదంటే రాజకీయ కోణం ఉందా అనే యాంగిల్‌లోనూ పోలీసులు విచారించనున్నారు. నిందితులంతా మంత్రి శ్రీనివాస్‌ గౌడ్ బాధితులమని పోలీసులకు వెల్లడించారు. రిమాండ్‌ రిపోర్ట్‌లో ఏ1 రాఘవేంద్రరాజు మంత్రితో ఎందుకు శత్రుత్వం పెరిగిందో వివరించాడు. రిమాండ్‌ రిపోర్ట్‌లో వినిపిస్తున్న మరో పేరు మున్నూరు రవి. మరో నిందితుడు యాదయ్య కూడా శ్రీనివాస్‌గౌడ్‌ బాధితుడినేనని పోలీసులకు వెల్లడించాడు.

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌పై హత్య కుట్ర కేసు ప్రకంపనలు సృష్టిస్తోంది. నిందితులకు, శ్రీనివాస్‌ గౌడ్‌కు మధ్య విభేదాలు కారణమని తెలుస్తోంది. అయితే బీజేపీ నేతల పేర్లు తెరపైకి రావడంతో రాజకీయంగానూ రగడ మొదలైంది. హత్యకు కుట్ర కేసు కాస్త టీఆర్‌ఎస్‌ వర్సెస్‌ బీజేపీగా మారిపోయింది. ఈ కేసు ముందు ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందో చూడాలి.

Read Also….  Telangana: ఆ రెండు సంస్థల్లో వెంటనే వైద్య సేవలు ప్రారంభించండి.. కేసీఆర్‌కు కిషన్‌ రెడ్డి లేఖ!