Telangana Ministers: నారాయణపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు..

|

Jul 10, 2021 | 1:26 PM

Telangana Ministers: తెలంగాణ వ్యాప్తంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా మంత్రులు...

Telangana Ministers: నారాయణపేటలో మంత్రి కేటీఆర్ పర్యటన.. మంత్రి కాన్వాయ్‌ని అడ్డుకున్న ఏబీవీపీ కార్యకర్తలు..
Minister Ktr
Follow us on

Telangana Ministers: తెలంగాణ వ్యాప్తంగా పట్టణ ప్రగతి, పల్లె ప్రగతి కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమాల్లో భాగంగా మంత్రులు, ఎమ్మెల్యేలు.. పట్టణాలు, పల్లెలను చుట్టేస్తున్నారు. రాష్ట్ర మున్సిపల్ అండ్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ శనివారం నాడు నారాయణ పేటలో పర్యటించారు. ఇక్కడ చేపట్టిన పలు అభివృద్ధి పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అంబేద్కర్ చౌరస్తా నుంచి సావర్కర్ చౌరస్తా వరకు నాలుగు కోట్ల రూపాయలతో నిర్మించే సివిల్ లైన్ రోడ్డు విస్తరణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అలాగే.. సింగారం చౌరస్తా వద్ద పది కోట్ల రూపాయలతో నిర్మించే టెక్స్ టైల్ పార్కు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అశోక్ నగర్ వద్ద రూ. 20 లక్షల తో అమరవీరుల స్థూపం నిర్మాణానికి‌ శంకుస్థాపన చేశారు. వీటితో నారాయణపేటలో పది వెంటిలేటర్లతో ఏర్పాటు చేసిన ఐసియు వార్డును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఇక సాయివిజయ కాలనీలో రూ. 70 లక్షలతో నిర్మించిన చిల్డ్రన్స్ పార్కును మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఆర్టీసీ కాలనీలో నిర్మించిన సైన్స్ పార్కు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమాల అనంతరం పట్టణ ప్రగతి బహిరంగ సభలో మంత్రి కేటీఆర్ ప్రసంగించనున్నారు. ఇదిలాఉంటే.. మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా నారాయణపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి కేటీఆర్ కాన్వాయ్‌ని ఏబీవీపీ విద్యార్థులు అడ్డుకున్నారు. వెంటనే అలర్ట్ అయిన పోలీసులు.. ఏబీవీపీ విద్యార్థులపై లాఠీచార్జీ చేశారు. వారిని అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు.

ఇక మరోవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలంలో రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పర్యటించారు. మండలంలో 4వ విడత పల్లె ప్రగతి కార్యక్రమాల అనంతరం ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుండాల గ్రామ కార్యదర్శితో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడారు. అధికారులు చేపట్టిన అభివృద్ధి పనులను అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఓపెన్ ప్లాట్స్‌లలో చెత్త, చెదారం ఉంటే వారికి నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు. అయినా వినని పక్షంలో వాటిని స్వాధీనపరచుకొని మొక్కలు నాటాలని సూచించారు. తమ ఆదేశాలు పాటించకపోతే.. ప్రభుత్వం తీసుకునే చర్యలకు మీరే బాధ్యులు అవుతారంటూ అధికారులకు వార్నింగ్ ఇచ్చారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. అలాగే మిషన్ భగీరథ నీళ్లు ఇళ్లలోకి కనెక్షన్లు ఇవ్వకపోవడంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. భగీరథ ఈఈ ని పిలిపించి పెండింగ్ పనులను మూడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

Also read:

Afghanistan Violence: దళాల ఉపసంహరణతో అఫ్గానిస్తాన్‌లో పేట్రేగుతున్న హింస.. ఆందోళన వ్యక్తం చేసిన భారత్!

Mother Dairy: అముల్ బాట‌లోనే మ‌ద‌ర్ డెయిరీ.. పాల ధరను పెంచిన సంస్థ.. లీటర్‌పై..

Zhurong Rover: చైనాకు చెందిన జురాంగ్‌ రోవర్‌ అంగారక గ్రహంపై అన్వేషణ.. కొత్త ఫోటోలు విడుదల