KTR on Revanth: 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ పార్టీ దేశానికి చేసింది ఏం లేదని రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. 60 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ మునుగోడు నియోజికవర్గానికి ఫ్లోరోసిస్ ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ పాపాలు పెరిగినట్టు ఫ్లోరోసిస్ పెరిగిందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా మంచి నీటిని అందిస్తున్న కేసీఆర్‌పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. ఇకపై సహించేదీలేదన్నారు.
తెలంగాణ తొలి ఉద్యమకారుడు శ్రీకాంతాచారి అయితే ఉద్యమ ద్రోహి రేవంత్ రెడ్డి అని విమర్శించారు. తెలంగాణ ఉద్యమం టైంలో చంద్రబాబు పక్కన ఉండి ఉద్యమ కారులపై దాడుల చేయించిన వ్యక్తి రేవంత్ రెడ్డి కాదా అని కేటీఆర్ ప్రశ్నించారు. శ్రీకాంతాచారికి ఉద్యమ ద్రోహులు నివాళులు అర్పించే అర్హత లేదని వ్యాఖ్యానించారు.
తెలంగాణ మొదటి ద్రోహి రేవంత్ రెడ్డి అన్న కేటీఆర్.. మందస్తు ఎన్నికలపై క్లారిటీ ఇచ్చారు. జంగ్ లేదు బొంగు లేదు జంగ్ సైరన్ లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇన్‌ఛార్జ్ మనిక్కం ఠాగూర్ కి 50 కోట్లు ఇచ్చి పీసీసీ తెచ్చుకున్నాడని వాళ్ళ పార్టీ నేతలే ఆరోపిస్తున్నారని గుర్తు చేశారు. టీపీసీసీ, టీబీజేపీ కేసీఆర్ పెట్టిన భిక్ష అన్నారు. కేసీఆర్ లాంటి పెద్ద మనిషి పట్టుకొని ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
మరోవైపు, బండి సంజయ్ పాదయాత్రపై మంత్రి కేటీఆర్ ఘాటుగానే స్పందించారు. అది పాదయాత్ర కాదు.. తిన్నది అరక్క చేసిన అజీర్తి యాత్ర అని ఎద్దేవా చేశారు. బీజేపీ చేసింది ప్రజాసంగ్రామ యాత్ర కాదని.. తిన్నది అరగక చేసినా అజీర్తి యాత్ర అన్నారు. బీజేపీ వాళ్లకు తెలిసింది హిందూ ముస్లిం ఒకటేనన్నారు. మతాన్ని అడ్డుపెట్టుకొని రాష్ట్రాన్ని నాశనం చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నిస్తుందన్నారు. మిషన్ భగీరథ నీళ్లు తాగి పచ్చని పంట పొలాల్లో యాత్ర చేసిన బీజేపీ నాయకులకు రాష్ట్ర అభివృద్ధి కనిపించడం లేదా మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. భారత దేశాన్ని సాదుతున్న రాష్ట్రాలో తెలంగాణ నాలుగో స్థానంలో ఉందని రిజర్వ్ బ్యాంకుచెప్పిందని మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు.
ఇక, రాష్ట్ర మొత్తం దళిత బంధు ఇస్తామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నియోజకవర్గాల అభివృద్ధి పేరుతో కొత్త నాటకానికి తెరలేపారన్న మంత్రి.. ఎవరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్నారు. సీఎం కేసీఆర్ కూడా రాష్ట్రం మొత్తం దళిత బంధు అమలు చేస్తామని ఇదివరకే స్పష్టం చేశారన్నారు.
Read Also… Google: మీ ప్రతి కదలికను గమనిస్తున్నారు.. వారు అలా చెయ్యొద్దంటే.. మీరు ఇలా చేయాలి.. లేకుంటే అంతే..