Minister KTR Letter Union Minister Piyush Goyal: చేనేత రంగానికి చేయూతనిచ్చేలా తెలంగాణకు ప్రాధాన్యత ఇవ్వాలంటూ కేంద్రమంత్రి పీయూష్ గోయల్‌కు రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. తెలంగాణ టెక్స్‌టైల్ రంగంలో పలు పెట్టుబడులను ఆకర్షించగలిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. ముఖ్యంగా చేనేతకు ప్రసిద్ధి గాంచిన సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. సమీకృత మరమగ్గాల క్లస్టర్ అభివృద్ధి పథకం (సీపీసీడీఎస్) కింద సిరిసిల్లలో మెగా పవర్‌లూమ్ క్లస్టర్ మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. గతంలో పలుసార్లు లేఖలు రాశామని, వ్యక్తిగతంగా సమావేశమైన సమయంలోనూ ఈ విషయమై గుర్తు చేసినా దురదృష్టవశాత్తు కేంద్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కొన్ని దశాబ్దాలుగా సిరిసిల్ల చేనేత, జైళీ రంగానికి ప్రధాన కేంద్రంగా ఉందని మంత్రి కేటీఆర్ లేఖలో గుర్తు చేశారు.
పట్టణంలో చేనేత కార్మికులకు ఉపాధిని కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుందని మంత్రి లేఖలో పేర్కొన్నారు. మెగా పవర్‌లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన వ్యవస్థ, శిక్షణ పొందిన మానవ వనరులున్నాయని పేర్కొన్నారు. చేనేత, జౌళిరంగం సర్వతోముఖాభివృద్ధికి, నేత కార్మికుల శ్రేయస్సు కోసం తెలంగాణ అనేక పథకాలు తీసుకొచ్చిందన్నారు. 40శాతం ఇన్‌ఫుట్ సబ్సిడీ వేజ్ కాంపెన్సేషన్ స్కీమ్, థ్రిఫ్ట్‌ఫండ్ తదితర పథకాలతో చేనేత, పవర్‌లూమ్ కార్మికులకు నిరంతరం పని అందించేలా రాష్ట్ర సర్కార్ చర్యలు తీసుకుందన్నారు. అలాగే, వెనుకబడి చేనేత కుటుంబాలకు ఆదాయ వనరులను సమకూర్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. గతంలో వివిధ సందర్భాల్లో తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న చర్యలు, కార్యక్రమాలను కేంద్రం ప్రసంశించిన విషయాన్ని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్రానికి, చేనేత, జౌళిరంగానికి సంబంధించి కేంద్రం నుంచి చెప్పుకోదగ్గ సహకారం అందించకపోవడంపై మంత్రి కేటీఆర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణ వంటి ప్రగతిశీల రాష్ట్రాలకు కేంద్రం ఆదరణ కల్పించకపోవడంతో.. మన దేశం చిన్న దేశాలతో కూడా పోటీపడలేకపోతుందన్నారు. అదే సమయంలో తెలంగాణ టెక్స్‌టైల్ రంగంలో పలు పెట్టుబడులను ఆకర్షించగలిగిందన్న విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ రాష్ట్రం చేనేత, జౌళి రంగానికి అదనపు బడ్జెట్‌ను కేటాయించిందని, కాకతీయ మెగా టెక్స్‌టైల్ పార్క్ వంటి ప్రపంచస్థాయి ప్రాజెక్టులను చేపట్టిందని పేర్కొన్నారు.
అవసరమైన వ్యవస్థ, వనరులు లేని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పథకాలు సహాయాన్ని ప్రకటిస్తున్న విషయాన్ని గుర్తు చేసిన మంత్రి కేటీఆర్.. దీని వల్ల వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ వంటి రాష్ట్రాలకు నష్టమన్నారు. మెగా పవర్‌లూమ్ క్లస్టర్‌వంటి ప్రాజెక్టుల ద్వారా ఏర్పడే ఉపాధి అవకాశాల కోసం తెలంగాణ యువత ఆసక్తిగా ఎదురుచూస్తున్నారన్నారు. ఇకనైనా ఆలస్యం చేకుండా సిరిసిల్లలో మెగా పవర్‌లూం క్లస్టర్ ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రజల తరఫున విజ్ఞప్తి చేస్తున్నానన్నారు.