Covid19: ఐసోలేషన్‌లో ఉండాల్సిన వారు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు.. థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంః డీహెచ్

|

Jul 31, 2021 | 4:48 PM

తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరక్టర్ డా. శ్రీనివాస్‌ రావు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వచ్చినవారు ఐసోలేషన్‌లో ఉండకుండా ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్నారన్నారు.

Covid19: ఐసోలేషన్‌లో ఉండాల్సిన వారు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నారు.. థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంః డీహెచ్
Telangana Medical And Health Director Srinivas
Follow us on

Telangana Coronavirus third wave: తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ డైరక్టర్ డా. శ్రీనివాస్‌ రావు తెలిపారు. కోవిడ్ పాజిటివ్ వచ్చినవారు ఐసోలేషన్‌లో ఉండకుండా ఇష్టారాజ్యంగా బయట తిరుగుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్ ప్రభావం ఇంకా తగ్గలేదని.. ఖమ్మం, నల్గొండ, కరీంనగర్ జిల్లా్ల్లో కేసులు అధికంగా నమోదవుతున్నాయన్నారు. ఖమ్మం జిల్లా కూసుమంచి గ్రామంలో ఒకేసారి భారీగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోందన్నారు. పూర్తిస్థాయిలో కరోనా తగ్గేంత వరకు మరింత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 9 జిల్లాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయని, ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే కేసులు పెరగుతున్నాయన్నారు. రాష్ట్రంలో థర్డ్‌ వేవ్‌ రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైనా ఉందన్నారు. భవిష్యత్తులో వ్యాక్సిన్ వేసుకున్న వారినే బహిరంగ ప్రదేశాల్లో అంటే, హోటల్స్, మాల్స్‌లోకి అనుమతించే అవకాశం ఉంటుందన్నారు. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యంగా డెల్టా రకం వేరియంట్‌ భారత్ సహా 135 దేశాల్లో తీవ్రత చూపించిందని డీహెచ్‌ అన్నారు. కొన్ని దేశాల్లో ఉద్ధృతంగా వ్యాపించిందన్నారు. ఈ వేరియంట్‌ శరీరంపై ఎక్కువ కాలం తీవ్ర ప్రభావాన్ని చూపడంతో పాటు ఇన్‌ఫెక్షన్‌ కలిగించే సామర్థ్యాన్ని గుర్తించినట్లు చెప్పారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రెండు డెల్టా ప్లస్‌ కేసులు నమోదయ్యాయన్నారు. మే నెల మధ్యలోనే ఈ కేసులను హైదరాబాద్‌లో గుర్తించినట్లు వివరించారు. డెల్టా ప్లస్ పాజిటివ్ వచ్చిన వారు కొలుకున్నారని.. వారి కాంటాక్ట్‌లను ట్రేస్‌ చేసి పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ వచ్చినట్లు శ్రీనివాస్ రావు స్పష్టం చేశారు.

ఇదిలావుంటే, రాష్ట్రంలో ఇప్పటివరకు 2.20 కోట్ల మంది ప్రజలు వ్యాక్సిన్‌కి అర్హులు కాగా. 1.12 కోట్ల మందికి ఇప్పటివరకు సింగల్ డోస్ ఇచ్చామన్నారు. రాష్ట్రంలో 33.79 లక్షల మందికి సెకండ్‌ డోస్ ఇవ్వడం పూర్తి అయింది. తొలి డోస్ తీసుకున్న వారిలో 30 శాతం మందికి రెండో డోస్ ఇచ్చాం. ఈ నెలలో ఇప్పటివరకు 30.04 లక్షల టీకా డోసులు రాష్ట్రానికి వచ్చాయి. కేటాయించిన దానికన్నా 9.5 లక్షల టీకా డోసులు అదనంగా రాష్ట్రానికి వచ్చాయని డీహెచ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 22.32 లక్షల మందికి కొవిషీల్డ్‌ రెండో డోస్ ఇవ్వాల్సి ఉండగా.. వారిలో 12 లక్షల మందికి ఇచ్చామని, కొవాగ్జిన్ సైతం 3లక్షల మందికి పైగా రెండో డోస్ ఇవ్వాల్సి ఉంది. వచ్చే ఒకటి రెండు వారాల్లో రెండో డోస్‌కి అధిక ప్రాధాన్యత ఇస్తామని శ్రీనివాస్ రావు తెలిపారు.

రాష్ట్రంలో థర్డ్‌ వేవ్‌ వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని డీహెచ్ స్పష్టం చేశారు. ఆక్సిజన్, వైద్య సిబ్బంది అందుబాటులో ఉన్నారన్నారు. వారికి తగిన శిక్షణ అందించడంతో పాటు ప్రభుత్వం పరిధిలోని 26 వేల బెడ్స్‌కి ఆక్సిజన్ సదుపాయాలు ఏర్పాటు చేశామన్నారు. పిల్లల కోసం జిల్లా ఆస్పత్రుల్లో అన్ని సౌకర్యాలు కల్పించినట్లు చెప్పారు. 100కు పైగా బెడ్స్ ఉన్న అన్ని ప్రైవేట్ ఆస్పత్రులు ఆగస్టు నెలాఖరు నాటికి ఆక్సిజన్ ప్లాంట్స్ అందుబాటులోకి తెచ్చుకోవాలని ఆదేశించారు.

Read Also…  Minister KTR: పరిశ్రమల స్థాపనలో తెలంగాణ దేశానికే ఆదర్శం.. ఉద్యోగాల్లో స్థానికులకే ప్రాధాన్యతః కేటీఆర్