చిన్న పరిశ్రమలకోసం MSME-2024 పాలసీని తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. సూక్ష్మ, చిన్న , మధ్యతరహా పరిశ్రమలు నిలదొక్కుకునేలా ఈ పాలసీని రూపొందించింది. ఇప్పటిదాకా సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు(MSME) ఎదురవుతున్న ఇబ్బందులపై అధ్యయనం చేసిన పరిశ్రమల శాఖ 6 అంశాలలో ప్రధానంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయని గుర్తించింది. ల్యాండ్, ఫైనాన్స్, రా మెటీరియల్, మానవవనరులు, టెక్నాలజీ, మార్కెటింగ్ విషయాల్లో MSMEలు ఇబ్బందులు పడుతున్నాయి. కొత్త పాలసీతో ఈ సమస్యలు పరిష్కారమవుతాయని భావిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. వీటితో పాటు మరో 40 విధానపరమైన నిర్ణయాలతో పరిశ్రమలకు తోడ్పాటునివ్వనుంది.
MSME ట్వంటీ ట్వంటీఫోర్ పాలసీలో ఎస్సీ, ఎస్టీలకు మూలధనాన్ని 50 లక్షల నుంచి కోటి రూపాయలకు పెంచింది రాష్ట్ర ప్రభుత్వం. మహిళా పారిశ్రామికవేత్తలకు ఈ పాలసీ ద్వారా ఇచ్చే సబ్సిడీని 20 శాతం పెంచారు. ఈ పాలసీ ద్వారా పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూమి ని ప్రభుత్వమే ఇస్తుంది. అవసరమైన పెట్టుబడిని సబ్సిడీ ద్వారా ప్రభుత్వమే సమకూరుస్తుంది. ముడిసరుకును సులువుగా సమకూర్చుకునేలా నిబంధనలు సడలించనుంది. ఐటిఐలు, స్కిల్ యూనివర్సిటీ ద్వారా MSMEలకు మానవ వనరులు సమకూరుస్తారు.
రాష్ట్ర GDPలో MSMEల పాత్ర కీలకంగా మారిందన్నారు డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క. గత ప్రభుత్వం MSMEలకు ఆర్భాటంగా రాయితీలు ప్రకటించినా నిధులు కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. MSMEలకు కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. పదేళ్ళలో గత ప్రభుత్వం MSMEలను విస్మరించిందని .. తమ ప్రభుత్వం వచ్చాక కొత్త పాలసీ తీసుకొచ్చామన్నారు. చిన్న పరిశ్రమలు వృద్ధి చెంది పెద్ద పరిశ్రమలు గా మారడానికి ఈ పాలసీ ఉపయోగపడుతుందన్నారు.
MSMEలకు ఇచ్చే సబ్సిడీ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అలసత్వం వహించిందనే విమర్శలు ఉన్నాయి.. మరి కాంగ్రెస్ ప్రభుత్వమైనా నిధులు కేటాయించి చిన్న పరిశ్రమలకు ఊతమిస్తుందో లేకపోతే పాలసీ కాగితాలకే పరిమితమవుతుందో చూడాలి మరి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..