Fish Lovers Spicial: తెలంగాణ వ్యాప్తంగా వానలు దంచికొడుతున్నాయి. ఒక్క ప్రాంతానికే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా వానలు విపరీతంగా కురుస్తున్నాయి. ఎడతెరపిలేని వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి.వరద నీటి ప్రవాహంతో రోడ్లు, వీధులన్నీ జలమయం అయ్యాయి. వరద నీటిలో ఎక్కడ చూసిన చేపలే ప్రత్యక్షమవుతున్నాయి. వరదలతో కొట్టుకుపోతున్న చేపలు పట్టుకునేందుకు జనం పరుగులు పెడుతున్నారు. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లడంతో మత్స్య సంపద విపరీతంగా వరదలకు కొట్టుకొస్తుంది. దీంతో చేపలు ఎక్కడపడితే అక్కడ దొరుకుతున్నాయి. మత్స్యకారులే కాదు ప్రతి ఒక్కరి చేపలను పట్టి విక్రయిస్తున్నారు. దాంతో చేపల ధర కూడా నేలకు పడిపోయింది.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో భారీ వర్షాలకు క్వింటాళ్లకొద్దీ చేపలు దొరుకుతున్నాయి. మామూలు రోజుల్లో కిలో నూట యాభై ఉండగా ప్రస్తుతం వంద రూపాయలకు 5 కిలోల చేపలు అమ్ముతున్నారు. ఇరవై రూపాయలకే కిలో చేపలు దొరకడంతో చేపలు కొనుగోలు చేసేందుకు జనం కూడా ఎగబడుతున్నారు. గత వారం రోజులుగా ఏ ఇంట్లో చూసినా చేపల కూర వాసనే వస్తోంది. మరికొందరు చేపలు చౌకగా దొరకడంతో చేప పచ్చడి పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. ఏది ఏమైనా మునుపెన్నడూ లేనివిధంగా చేపలు దొరకడంతో చేపల కూర, పులుసు, పచ్చడి అంటూ చేపల ప్రియులు తెగ ఎంజాయ్ చేస్తున్నారు.
మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి