Telangana: అసెంబ్లీ స్పీకర్ నోటీసులపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్‌ స్పందించారు. స్పీకర్ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పలేదన్నారు. స్పీకర్‌ నోటీసులకు తమ అడ్వకేట్‌ వివరణ ఇచ్చారని తెలిపారు. ఒకవేళ స్పీకర్ రమ్మంటే విచారణకు వెళ్తా అన్నారు. అడ్వకేట్ లేఖ తర్వాత స్పీకర్‌ నుంచి మళ్లీ జవాబు రాలేదని తెలిపారు దానం నాగేందర్‌. అటు బీఆర్ఎస్ పార్టీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు.

Telangana: అసెంబ్లీ స్పీకర్ నోటీసులపై ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే దానం నాగేందర్
Khairatabad Mla Danam Nagender

Updated on: Jan 29, 2026 | 11:23 AM

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్‌ నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్‌ స్పందించారు. స్పీకర్ విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పలేదన్నారు. స్పీకర్‌ నోటీసులకు తమ అడ్వకేట్‌ వివరణ ఇచ్చారని తెలిపారు. ఒకవేళ స్పీకర్ రమ్మంటే విచారణకు వెళ్తా అన్నారు. అడ్వకేట్ లేఖ తర్వాత స్పీకర్‌ నుంచి మళ్లీ జవాబు రాలేదని తెలిపారు దానం నాగేందర్‌. అటు బీఆర్ఎస్ పార్టీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌ తనను సస్పెండ్‌ చేయలేదని దానం నాగేందర్ స్పష్టం చేశారు. బీఆర్‌ఎస్‌ యాక్షన్‌కు తన రీయాక్షన్‌ ఉంటుందని.. ఎన్నికలకు తాను భయపడను అన్నారు దానం. బీఆర్‌ఎస్ కంప్లైంట్‌పై క్రాస్‌ ఎగ్జామినేషన్ కోసం..తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్.. ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు నోటీసులు ఇచ్చారు. స్పీకర్‌ ముందు దానం హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే దానం చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి.

ఇదిలావుంటే, తెలంగాణలో పార్టీ ఫిరాయింపు కేసులను ఎదుర్కొంటున్న పది మంది ఎమ్మెల్యేల్లో ఇప్పటికే ఏడుగురు సేఫ్ జోన్‌లోకి వెళ్లిపోయారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, తెల్లం వెంకట్రావు, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాష్ గౌడ్‌ బీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతున్నట్టు తీర్పు వెల్లడించారు. వీళ్లు పార్టీ మారినట్టు ఏ ఆధారాలు లేవన్నారు. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌, కడియం శ్రీహరి స్పీకర్ విచారణకు హాజరై వివరణ ఇచ్చారు. ఈ ఇద్దరి పిటిషన్లపై నిర్ణయాన్ని స్పీకర్ వెల్లడించాల్సి ఉంది. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ మాత్రం విచారణకు హాజరయ్యేందుకు సమయం కోరారు. అప్పుడు సమయమిచ్చిన స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం దానం నాగేందర్‌కు నోటీసులు పంపారు. జనవరి 30వ తేదీన విచారణకు హాజరుకావాలని ఆదేశించారు.

మరోవైపు అనర్హత పిటిషన్‌పై అఫిడవిట్‌ వేశారు ఎమ్మెల్యే దానం నాగేందర్. పిటిషన్‌ను కొట్టివేయాలని స్పీకర్‌కు విజ్ఞప్తి చేశారు. తాను BRSకు రాజీనామా చేయలేదన్నారు దానం నాగేందర్‌. తనను BRS పార్టీ సస్పెండ్‌ చేసినట్టు సమాచారం లేదన్నారు. 2024 మార్చిలో కాంగ్రెస్‌ సమావేశానికి వెళ్లానని దానం తెలిపారు. కాంగ్రెస్‌ సమావేశానికి వ్యక్తిగత హోదాలో వెళ్లానన్నారు. ఇదిలావుంటే, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల పట్ల స్పీకర్ ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారని ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్. కాంగ్రెస్ గుర్తుపై ఎంపీగా పోటీ చేసిన దానం విషయంలోనూ స్పీకర్ సరైన నిర్ణయం తీసుకోకపోతే న్యాయపోరాటం చేస్తామని బీఆర్ఎస్ హెచ్చరించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..