హైదరాబాద్, జులై 27: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జూనియర్ కాలేజీల్లో 2023-24 విద్యా సంవత్సరానికి ఇంటర్ ప్రథమ సంవత్సరం ప్రవేశాల గడువును జులై 31 వరకు పెంచుతూ ఇంటర్ బోర్డు కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో ఇచ్చిన ప్రకటన ప్రకారం జులై 25తో గడువు ముగియగా తాజాగా తుది గడువును ఈ నెలాకరు వరకు పొడిగించారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో ఈ మేరకు పొడిగించారు.
జులై 31 తర్వాత అడ్మిషన్లు పొందే విద్యార్ధులు ఆలస్య రుసుము చెల్లించవల్సి ఉంటుందని తెలిపారు. ఆగస్టు 1 నుంచి 16 మధ్యలో చేరితే రూ.500 ఆలస్య రుసుం చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఇక డిగ్రీ ప్రవేశాలకు నిర్వహిస్తోన్న దోస్త్ మూడో విడతలో సీట్లు పొందిన విద్యార్థులు ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసే గడువును జులై 28 వరకు పొడిగించారు. మూడు విడతల్లో సీట్లు పొందిన విద్యార్ధులు ఆయా కాలేజీల్లో స్వయంగా రిపోర్ట్ చేయాలని అధికారులు పేర్కొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.