తెలుగు రాష్ట్రాల మధ్య వాటర్ వార్ పతాకస్థాయికి చేరింది. రెండు రాష్ట్రాలు అస్సలు వెనక్కు తగ్గడం లేదు. తాజాగా తెలంగాణ మరో దూకుడు స్టెప్ వేసింది. పులిచింతల ప్రాజెక్టు వద్ద జలవిద్యుత్ కేంద్రంలో టీఎస్ జెన్‌కో ఉత్పత్తిని పెంచినట్లు ప్రాజెక్టు అధికారులు చెబుతున్నారు. సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి 50 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేస్తోంది. అంతకు ముందు 24 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసినట్లు అధికారులు తెలిపారు. పులిచింతలలోని మూడు యూనిట్లలో తెలంగాణ జెన్‌కో కరెంట్ ఉత్పత్తి చేస్తూ.. 9,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తోంది. తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని ఏపీ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో ఉత్పత్తిని పెంచడం చర్చనీయాంశమవుతోంది.
పులిచింతలలో విద్యుత్ ఉత్పత్తి నేపథ్యంలో ఇప్పటికే విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుంచి నీటిని వృథాగా సముద్రంలోకి వదిలేయాల్సి వచ్చింది. తెలంగాణ విద్యుదుత్పత్తిని పెంచడం ద్వారా ఆంధ్రప్రదేశ్ వాటాకి రావాల్సిన నీటి వాటా సముద్రం పాలవుతోందని ఏపీ నేతలు ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. జల వివాదంపై ఇరురాష్ట్రాలు వెనక్కి తగ్గకపోవడంతో పరిస్థితి జటిలమవుతోంది. కేంద్రమే పరిస్థితిని చక్కబెట్టాలని ఏపీ ప్రభుత్వం కోరుతోంది. కేఆర్‌ఎంబీ ఏపీపై వివక్ష చూపుతోందని.. తక్షణమే జల్‌శక్తి శాఖ జోక్యం చేసుకోవాలని సీఎం జగన్ లేఖ రాశారు. తొలుత తెలంగాణ తలపెట్టిన ప్రాజెక్టులను పరిశీలించాకే ఏపీలోని రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను పరిశీలించాలని.. ఈమేరకు ఆదేశాలివ్వాలని కేంద్ర మంత్రికి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. కేఆర్ఎంబీ పరిధిని వెంటనే నోటిఫై చేయాలని కోరారు. ఉమ్మడి ప్రాజెక్టుల వద్ద సీఐఎస్ఎఫ్ బలగాలను మోహరించాలని విన్నవించారు. జగన్ లేఖపై కేంద్ర ఎలా స్పందిస్తుందో వేచిచూడాలి.
Also Read: శ్రీశైలంలో అంతు చిక్కని రహస్యం.. డ్రోన్ల చక్కర్లపై ఫోకస్ పెట్టిన కర్నూలు ఎస్పీ..