తెలంగాణ ఉద్యమంలో తూటాల్లాంటి మాటలే కాదు.. అద్భుతమైన పాటలు కూడా.. నిద్రాణమై ఉన్న జాతిని మేల్కొలిపాయి..! ఎందరో కవులు, మరెందరో కళాకారులు.. తమ కలానికి పని చెప్పి కదనోత్సాహంతో.. పోరాటంలో ముందుకు సాగారు. అలాంటివారిలో అగ్రగణ్యుడు అందెశ్రీ అనడంలో ఎలాంటి అతిశయోక్తీ లేదు. ప్రజాకవి, సుప్రసిద్ధ రచయిత… ఇలా అందెశ్రీ పేరుకు ముందు ఎన్ని కీర్తిమకుటాలు పెట్టినా, ఆయనకు మాత్రం ఉద్యమకారుడనే బిరుదే అనంతమైనది. ఆకాశమంత ఎత్తైనది. అందుకే, పాటల ప్రస్థానంతో ఉద్యమానికి ఊతమిచ్చిన ఆయనను.. తెలంగాణ పోరాటయోధుడిగా పిలవడమే సముచితమైనది. స్వరాష్ట్ర సాధన పట్ల అంత చిత్తశుద్ధి ఉంది కాబట్టే… తెలంగాణ పట్ల అంతటి మక్కువ ఉంది కాబట్టే.. ఆయన కలం వెంట జయజయహే తెలంగాణ అంటూ.. అద్భతగీతం జాలువారింది. పద్నాలుగు సంవత్సరాల మలిదశ ఉద్యమాన్ని ఉర్రూతలూగించింది. ఒక్క గీతంతో ప్రస్ఫుటమైన రచనాశైలి.. ఉమ్మడి రాష్ట్రంలో జయజయహే అంటూ తెలంగాణ జాతి అనధికారికంగా జెండా ఎగరేసింది. ఈ ఒక్క గీతం చాలు.. ఆయన రచనాశైలి ఎంత గొప్పదో చెప్పడానికి.. ఆయనతో తెలంగాణ లోగిలి ఎంతలా సమ్మిళితమైందో వర్ణించడానికి..! అందుకేనేమో, ఉద్యమ గీతాల్లో అన్నీ ఒకెత్తు.. అందెశ్రీ గీతం మరో ఎత్తు.. జయజయహే అంటూ.. స్వరాష్ట్ర పోరాటంలో యావత్‌జాతి జయకేతనం ఎగరేసేవరకు.. ప్రతీచోట ఆయన పాటే నిత్య స్మరణమైంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉండగానే.. తెలంగాణలోని పలుచోట్ల, అనధికారికంగా పాఠశాలల్లో , కాలేజీల్లో ఆలపించారంటేనే.. ఆ గీతం గొప్పదనం ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. జయజయహే .. సాంగ్.. ఉద్యమంలో...