
తెలంగాణలో అల్పాదాయ వర్గాల కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న లక్ష ఫ్లాట్ల నిర్మాణ పథకానికి పేరు ఖరారు చేసేందుకు తెలంగాణ హౌసింగ్ బోర్డు వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకానికి ప్రజల నుంచే పేర్లను ఆహ్వానిస్తూ, ఉత్తమమైన పేరును సూచించిన వారికి రూ.లక్ష నగదు బహుమతిని ప్రకటించింది. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా క్యూర్ (Core Urban Region Expansion) పరిధిలో లక్ష ఫ్లాట్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలుకానున్న ఈ ప్రాజెక్టుకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు హౌసింగ్ బోర్డు ఈ ప్రత్యేక పోటీని నిర్వహిస్తోంది.
హౌసింగ్ బోర్డు వైస్ చైర్మన్ వి.పి. గౌతం వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ నెల 28వ తేదీ వరకు సోషల్ మీడియా వేదికగా పేర్ల సూచనలను స్వీకరిస్తారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతిపాదనల్లో ఉత్తమమైన పేరును ఎంపిక చేసి, ఆ పేరును సూచించిన వ్యక్తికి రూ.లక్ష బహుమతిని అందజేస్తారు. తెలంగాణ హౌసింగ్ బోర్డు చేపట్టిన ప్రాజెక్టులకు గతంలో మంచి ఆదరణ లభించిందని, అందుబాటు ధరల్లో సొంతింటి కలను సాకారం చేయడంలో బోర్డుకు ప్రత్యేక గుర్తింపు ఉందని అధికారులు పేర్కొంటున్నారు. సుదీర్ఘ విరామం తర్వాత చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టులో ప్రజలను భాగస్వాములుగా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
పోటీలో పాల్గొనాలనుకునే వారు హౌసింగ్ శాఖ అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతా tghd.official ద్వారా తమ సూచనలను పంపవచ్చు. క్యూర్ పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎల్‌ఐజీ ఫ్లాట్ల నిర్మాణానికి అవసరమైన భూములను ఇప్పటికే గుర్తించామని అధికారులు వెల్లడించారు.త్వరలోనే దరఖాస్తుల స్వీకరణ, లాటరీ విధానం ద్వారా ఇళ్ల కేటాయింపు వంటి పూర్తి మార్గదర్శకాలను ప్రభుత్వం ప్రకటించనుంది. దీంతో సొంతింటి కోసం ఎదురుచూస్తున్న అల్పాదాయ వర్గాల ప్రజల్లో ఈ పథకంపై ఆసక్తి నెలకొంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.