Telangana High Court: సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పై తెలంగాణ హైకోర్టు సీరియస్ అయ్యింది. రైతాంగాన్ని ఉద్దేశించి ఇటీవల కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ధర్మాసనం ఫైర్ అయ్యింది. యాసంగి వరి విత్తనాల అమ్మకాలపై సిద్ధిపేట కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. వరి విత్తనాలు అమ్మకూడదని సిద్ధిపేట కలెక్టర్ మౌఖిక ఆదేశాలు ఇచ్చారని, దీనిపై చర్యలు తీసుకోవాలంటూ కోర్టును కోరారు పిటిషనర్. సిద్ధిపేట కలెక్టర్, తెలంగాణ ప్రభుత్వం, సిద్ధిపేట వ్యవసాయ అధికారి, మండల వ్యవసాయ అధికారిని ప్రతివాదులుగా చేర్చారు పిటీషనర్. కాగా, ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. వరి విత్తనాల అమ్మకాలను ప్రొహిబీషన్ యాక్ట్‌లో ఏమైనా చేర్చారా? అని హైకోర్టు ప్రశ్నించింది. దీనికి స్పందించిన ఏజీ బీఎస్ ప్రసాద్.. అలాంటిది ఏమీ లేదని కోర్టుకు వివరించారు. ఇప్పటి వరకు అలాంటి చర్యలు ఏమీ ప్రభుత్వం తీసుకోలేదని, ఇకపై కూడా తీసుకోబోదని ఏజీ బీఎస్ ప్రసాద్.. హైకోర్టు ధర్మాసనానికి హామీ ఇచ్చారు. అయితే, రైతులపై, వరిసాగుపై కలెక్టర్ చేసిన వ్యాఖ్యలపై హైకోర్టు ధర్మాసనం ఫైర్ అయ్యింది. రైతుల విషయంలో కలెక్టర్ ఎలా వ్యాఖ్యలు చేస్తారని ప్రశ్నించింది. కలెక్టర్ తీరుపై హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. ఈ కేసులో క్రిమినల్ కంటెంట్ కనబడుతోందని హైకోర్టు వ్యాఖ్యానించింది. కాగా, ఈ పిటీషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్‌కు బదిలీ చేయాలని రిజిస్ట్రార్‌కు ధర్మాసనం ఆదేశించింది.
Also read:
Krithi Shetty Photos: కొత్త అందాలతో ఆకట్టుకుంటున్న ‘కృతి శెట్టి’.. దేవకన్య అంటూ కామెంట్స్..(ఫొటోస్)