Telangana High-court judges number to increase: ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరిగింది. రాష్ట్రం ఏర్పడిన నుంచి తెలంగాణ ప్రభుత్వం పలుమార్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను అభ్యర్థించినా న్యాయమూర్తుల పెంపు నిర్ణయాన్ని వారు తీసుకోలేదు. తాజాగా ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణ చిరకాలంగా పెండింగులో వున్న అంశాన్ని వెలికి తీసి మరీ నిర్ణయం తీసుకున్నారు. దాంతో తెలంగాణ హైకోర్టులో జడ్జీల సంఖ్య పెరగబోతోంది. ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో 24 మంది జడ్జీలున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత హైకోర్టు కూడా రెండుగా విభజితమైన సంగతి తెలిసిందే. దామాషా పద్దతిలో తెలంగాణ హైకోర్టుకు జడ్జీలను కేటాయించారు. అప్పట్నించి జడ్జీల సంఖ్యను పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును కోరుతూ వస్తోంది. ప్రధాన మంత్రికి పలుమార్లు తెలంగాణ ముఖ్యమంత్రి లేఖలు కూడా రాశారు. కానీ కారణాలేవైనా నిర్ణయం మాత్రం వెలవడ లేదు.
ప్రస్తుతం తెలంగాణ హైకోర్టులో వున్న 24 మంది న్యాయమూర్తుల సంఖ్యను 42కు పెంచుతూ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నిర్ణయం తీసుకున్నారు. న్యాయమూర్తుల సంఖ్యను ఏకంగా 75 శాతం పెంచడం విశేషం. పెరిగిన న్యాయమూర్తుల సంఖ్య 42 కాగా.. వారిలో 32 మంది శాశ్వత న్యాయమూర్తులు.. 10 మంది అదనపు జడ్జీలుంటారు. 2014లో తెలంగాణ ఏర్పడినప్పట్నించి ముఖ్యమంత్రి కేసీఆర్ జడ్జీల పెంపు అంశాన్ని పలుమార్లు ప్రస్తావించారు. గత రెండేళ్ళుగా ఈ అంశంపై ఎలాంటి పురోగతి లేదు. న్యాయమూర్తుల సంఖ్యను పెంచాలని ప్రధాన మంత్రితోపాటు న్యాయశాఖా మంత్రికి కేసీఆర్ పలుమార్లు లేఖలు కూడా రాశారు. తాజాగా చీఫ్ జస్టిస్‌గా బాధ్యతలు చేపట్టిన జస్టిస్ ఎన్వీ రమణ.. పాత ఫైలును వెలికి తీసి మరీ వేగంగా నిర్ణయం తీసుకోవడంతో.. తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య పెరిగేందుకు అవకాశమేర్పడింది.