Telangana Health Department tells politicians: హుజూరాబాద్ ఉప ఎన్నికకు కరోనా థర్డ్ వేవ్ ముప్పు తప్పదా…రాజకీయ పార్టీలు బాధ్యతాయుతంగా లేవంటూ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ కామెంట్స్ వెనుక మతలబు ఏంటి.. డిహెచ్ ఎవరిని హెచ్చరిస్తున్నారు. పాదయాత్రలు, బస్సు యాత్రలు కరోనా క్యారియర్లుగా మరనున్నాయన్న తెలంగాణ ఆరోగ్య శాఖ హెచ్చరికలు.. తెలంగాణ రాజకీయ నేతల మధ్య దుమారం రేగుతోంది.
కోవిడ్ నిబంధనలు సాధారణ ప్రజలకేనా- రాజకీయ పార్టీలకు నేతలకు వర్తించవా? ఒకవైపు ప్రపంచ ఆరోగ్య నిపుణులు.. మరోవైపు వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరించినా పట్టింపు లేదా? థర్డ్ వేవ్ ముంపు ఉందని చెప్తున్నా- కేసులు పెరుగుతున్నా పార్టీలు మాత్రం పట్టింపు లేనట్లే వ్యవహరిస్తున్నాయి…
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆరెస్‌తో పాటు ప్రతిపక్ష పార్టీలన్నీ కరోనా నిబంధనలు తుంగలో తొక్కుతున్నాయి. సాధారణ ఎన్నికలకు రెండున్నర ఏళ్ల సమయం ఉన్నా. ఇప్పుడే చైతన్య యాత్రలు ఎందుకు చేస్తున్నారని ఆరోగ్య శాఖ ప్రశ్నిస్తోంది. పాదయాత్రలు సభలు రాజకీయ నాయకుల హక్కు అయినా కనీస నిబంధనలు పాటించాలని కోరుతుంది. సభల్లో నాయకులు మాట్లాడుతుంటే పాల్గొన్న ప్రజలు కనీస బాధ్యతగా మాస్కులు కూడా పెట్టుకోవడం లేదంటూ రాష్ట్ర హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి.
దేశ వ్యాప్తంగా కరోనా థర్డ్ వేవ్ ముప్పు కచ్చితంగా ఉందని చెప్తున్నా పాలించే నాయకులే పాటించకపోవడం గమనార్హం. వందల వేల సంఖ్యల ప్రజలతో సభలు, ర్యాలీలు, సమావేశాలు నిర్వహిస్తున్నాయి రాజకీయ పార్టీలు. ఆరోగ్య శాఖ పార్టీలను కోరుతూ ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు ఇస్తున్నా.. వచ్చినప్పుడు చూద్దాంలే అన్నట్లు అవలంబిస్తున్నాయి. ఇటీవల ముగిసిన నాగార్జున సాగర్ ఉప ఎన్నికలకు ముందు సెకండ్ వేవ్ ముప్పు ఉందని ఎంతచెప్పినా వినకుండా భారీ సంఖ్యలో సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించారు. దాని ఫలితం కనీసం రాష్ట్రంలో ఆక్సిజన్ దొరకని స్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్లీ అధికార, విపక్షం అనే తేడా లేకుండా భారీ స్థాయిలో ప్రచారాలు, పాదయాత్రలు, ర్యాలీలు, సభలు నిర్వహిస్తున్నాయి. దీంతో మరోసారి ఆందోళన వ్యక్తమవుతోంది.
రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ పార్టీల కరోనా నిబంధనల ఉల్లంఘన వల్ల ఆయా జిల్లాలో కేసులు పెరుగుతున్నాయి. సాధారణ ప్రజలు నలుగురు గుమ్మి గూడితే కేసులు పెట్టే పోలీసులు.. ఇక్కడ మాత్రం కనిపించడం లేదు. వేల సంఖ్యలో ప్రజలను ఒకే చోటుకు చేర్చి కేసుల పెరుగుదలకు కారణం అవుతున్నారని తెలంగాణ డైరెక్టర్ ఆఫ్ హెల్త్ చెబుతోంది. ప్రస్తుతం కరోనా రాష్ట్రంలో అదుపులోనే ఉన్నా.. వేలు, వందల సంఖ్యలో ప్రజలు ఒకే చోటుకు చేరితే ఇప్పటికే మొదలైన థర్డ్ వేవ్ కోవిడ్ కేసులు తారాస్థాయికి చేరుతుందని హెచ్చరిస్తోంది ఆరోగ్యశాఖ. మరి ఇప్పటికైనా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ రాజకీయ పార్టీలు వారి కార్యక్రమాలు చేసుకోవాలని పలువురు అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Read Also…