Telangana: శ్వేతపత్రాల విడుదలకు ప్రభుత్వం సిద్ధం.. 5 లక్షల 59వేల కోట్ల అప్పుల్లో తెలంగాణ: ఆర్థికశాఖ సమీక్షలో భట్టివిక్రమార్క

Finance Minister Mallu Bhatti Vikramarka: పాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పుకున్న బాధలు విన్న తర్వాత తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదని భావించి, వారి సమస్యల పరిష్కారం కోసం ఆరు గ్యారెంటీలు, అభయహస్తం మేనిఫెస్టోలో హామీలను ప్రకటించినట్లు తెలిపారు. ఈ హామీలను నెరవేర్చడానికి ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా అధికార యంత్రాంగం పనిచేయాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

Telangana: శ్వేతపత్రాల విడుదలకు ప్రభుత్వం సిద్ధం.. 5 లక్షల 59వేల కోట్ల అప్పుల్లో తెలంగాణ: ఆర్థికశాఖ సమీక్షలో భట్టివిక్రమార్క
Mallu Bhatti Vikramarka

Updated on: Dec 10, 2023 | 9:11 AM

Deputy CM, Finance Minister Mallu Bhatti Vikramarka: యస్‌.. తెలంగాణలో ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమవుతోంది. శుక్రవారం ఆర్థికశాఖ అధికారులతో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టివిక్రమార్క సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, ఆదాయ, వ్యయాలు, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. 2014 జూన్ రెండో తేదీ నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ఆదాయం, వ్యయం, కలిగిన ప్రయోజనాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు.

రాష్ట్రం ఐదున్నర లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందని, అయినప్పటికీ సవాల్‌గా ఆర్థికశాఖ బాధ్యతలు తీసుకున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలు, అభయ హస్తం మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలు నెరవేర్చేలా ఆదాయాన్ని పెంచుకోవడం కోసం అధికారులు మనస్ఫూర్తిగా పనిచేయాలని వారిని కోరారు. ప్రభుత్వ విజయం ఆర్థికశాఖపై ఆధారపడి ఉంటుందన్న భట్టి, ఉద్యోగస్తుల్లా కాకుండా రాష్ట్ర అభివృద్ధికి పనిచేస్తున్నామన్న చిత్తశుద్ధితో విధులు నిర్వర్తిస్తే ప్రభుత్వ లక్ష్యాలు నెరవేరుతాయని సూచించారు.

అనేక సవాళ్లను అధిగమిస్తూ రాష్ట్ర ఆర్థిక పురోగతిని కలిసికట్టుగా సాధిద్ధామని మంత్రి భట్టి పిలుపునిచ్చారు. పాదయాత్ర సందర్భంగా అన్ని వర్గాల ప్రజలు చెప్పుకున్న బాధలు విన్న తర్వాత తెచ్చుకున్న తెలంగాణకు అర్థం లేదని భావించి, వారి సమస్యల పరిష్కారం కోసం ఆరు గ్యారెంటీలు, అభయహస్తం మేనిఫెస్టోలో హామీలను ప్రకటించినట్లు తెలిపారు. ఈ హామీలను నెరవేర్చడానికి ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా అధికార యంత్రాంగం పనిచేయాలని భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..