AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana: తెలంగాణ యువతకు గోల్డెన్ ఛాన్స్.. గ్లోబల్ కెరీర్‌కు గేట్‌వేగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు

తెలంగాణ నిరుద్యోగ యువతకు రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే సువర్ణావకాశం కల్పిస్తోంది. గ్లోబల్ మార్కెట్‌లో డిమాండ్ ఉన్న సరికొత్త టెక్నాలజీపై పట్టు సాధించేందుకు వీలుగా పాత ఐటీఐలను అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తోంది. ఆర్థిక ఇబ్బందులు ఉన్న విద్యార్థులకు స్టైపెండ్లు అందిస్తూ, ప్రపంచ స్థాయి నైపుణ్యాలను నేర్పిస్తోంది. మల్లేపల్లి ఏటీసీని సందర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి.. క్రమశిక్షణ, అంకితభావం ఉంటే యువత అంతర్జాతీయ కెరీర్‌ను నిర్మించుకోవచ్చని పిలుపునిచ్చారు.

Telangana: తెలంగాణ యువతకు గోల్డెన్ ఛాన్స్.. గ్లోబల్ కెరీర్‌కు గేట్‌వేగా అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లు
Telangana Skill Development
Prabhakar M
| Edited By: |

Updated on: Jun 05, 2026 | 9:10 PM

Share

హైదరాబాద్: తెలంగాణ యువతకు ప్రపంచ స్థాయి ఉద్యోగ అవకాశాలు అందించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయ ఐటీఐలను అత్యాధునిక అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా (ఏటీసీలు) అభివృద్ధి చేస్తోంది. ఈ కేంద్రాలు కేవలం శిక్షణా సంస్థలుగా కాకుండా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలు, అంతర్జాతీయ కెరీర్‌లకు వేదికలుగా మారుతున్నాయని రాష్ట్ర కార్మిక, ఉపాధి, గనులు, భూగర్భ వనరుల శాఖ మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి తెలిపారు.

మల్లేపల్లి అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్‌ను మీడియా ప్రతినిధులతో కలిసి సందర్శించిన మంత్రి, అక్కడి విద్యార్థులు, ట్రైనర్లు ఆధునిక సాంకేతిక పరికరాలు, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా అందిస్తున్న శిక్షణా విధానాలను ప్రదర్శించారు. కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక సదుపాయాలు పరిశ్రమలకు అవసరమైన నైపుణ్యాల అభివృద్ధికి ఎంతగానో దోహదపడతాయని పేర్కొన్నారు.

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేయడంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం టాటా టెక్నాలజీస్ భాగస్వామ్యంతో సుమారు రూ.4,000 కోట్ల విలువైన ఆధునిక సాంకేతిక వనరులు, శిక్షణా మౌలిక సదుపాయాలను ఏటీసీల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో విద్యార్థులు తాజా సాంకేతిక పరిజ్ఞానంపై ప్రత్యక్ష అనుభవాన్ని పొందే అవకాశం కలుగుతోంది. ఆర్థిక ఇబ్బందులు విద్యకు అడ్డంకిగా మారకుండా ఏటీసీల్లో చేరిన విద్యార్థులకు ప్రభుత్వం స్టైపెండ్లు కూడా అందిస్తోంది. దీంతో గ్రామీణ, పేద కుటుంబాలకు చెందిన యువత కూడా అత్యాధునిక నైపుణ్యాలను సులభంగా నేర్చుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.

భవిష్యత్ పరిశ్రమల అవసరాలను దృష్టిలో పెట్టుకుని శిక్షణా సంస్థలను ఆధునీకరిస్తున్నామని మంత్రి తెలిపారు. ఈ చర్యల ద్వారా అత్యున్నత నైపుణ్యాలు కలిగిన మానవ వనరులు తయారవుతాయని, తెలంగాణ యువతకు దేశీయంగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఉద్యోగ అవకాశాలు విస్తరిస్తాయని చెప్పారు. ఏటీసీలను యువతకు లభించిన సువర్ణావకాశంగా అభివర్ణించిన మంత్రి, అందుబాటులో ఉన్న వనరులను పూర్తిగా వినియోగించుకోవాలని విద్యార్థులకు సూచించారు. క్రమశిక్షణ, అంకితభావం, నిరంతర అభ్యాసం ఉంటే ప్రపంచ స్థాయి కెరీర్‌ను నిర్మించుకోవడం సాధ్యమని పేర్కొన్నారు.

ఐటీఐల మౌలిక సదుపాయాల అభివృద్ధితో పాటు శిక్షకులకు కూడా ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన బోధన, ప్రాక్టికల్ శిక్షణ అందించడమే లక్ష్యంగా ఈ చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు.

మల్లేపల్లి ఐటీఐలో ఈ సందర్భంగా ప్రత్యేక ఫోటో ఎగ్జిబిషన్, సాంకేతిక ప్రదర్శనను నిర్వహించారు. శిక్షణ పూర్తి చేసి ఉద్యోగాలు సాధించిన పలువురు విద్యార్థులు తమ అనుభవాలను పంచుకుంటూ, ఏటీసీల్లో పొందిన శిక్షణ తమ కెరీర్‌లో కీలక మలుపు తీసుకువచ్చిందని వివరించారు.

శాఖ అధికారులు, ట్రైనర్లు, సిబ్బంది కృషిని అభినందించిన మంత్రి డా. వివేక్ వెంకటస్వామి, తెలంగాణను దేశంలోనే ప్రముఖ నైపుణ్యాభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దడంలో ఏటీసీలు కీలక పాత్ర పోషిస్తాయని విశ్వాసం వ్యక్తం చేశారు. యువత భవిష్యత్తును మరింత బలోపేతం చేసే ఈ కార్యక్రమం రాష్ట్ర అభివృద్ధిలో కొత్త అధ్యాయానికి నాంది పలుకుతుందని పేర్కొన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us