Hyderabad: డ్రగ్స్ కట్టిడిపై పోలీసుల కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి స్కూల్, కాలేజీలో ఏడీసీ కమిటీలు!
విద్యార్థుల్లో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. అన్ని విద్యా సంస్థల్లో యాంటీ డ్రగ్ కమిటీలను తప్పనిసరి చేశారు. డ్రగ్స్ ప్రమాదాలు, ఎన్‌డీపీఎస్ చట్టంపై అవగాహన కల్పించాలని, అనుమానిత కార్యకలాపాలపై పోలీసులకు తెలియజేయాలని ఆదేశించారు. ఈ ఆదేశాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

విద్యార్థుల్లో పెరుగుతున్న మాదకద్రవ్యాల వినియోగాన్ని అరికట్టేందుకు సైబరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, ప్రొఫెషనల్ విద్యాసంస్థలు, రెసిడెన్షియల్ క్యాంపస్‌లు, స్పోర్ట్స్ అకాడమీలు, కోచింగ్ సెంటర్లు, విద్యార్థులు ఉండే ప్రైవేట్ హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ (PG), కో-లివింగ్ సౌకర్యాలు కల్పిస్తున్న అన్ని సంస్థల్లో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
సైబరాబాద్ పోలీసు కమిషనర్ రమేశ్ జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం, ప్రతి విద్యాసంస్థలో కనీసం ఐదుగురు సభ్యులతో యాంటీ డ్రగ్ కమిటీ (ADC) ఏర్పాటు చేయాలి. ఇందులో యాజమాన్యం, అధ్యాపకులు, విద్యార్థులు, హాస్టల్ నిర్వాహకులు, సాధ్యమైన చోట తల్లిదండ్రుల ప్రతినిధులు ఉండాలి. అలాగే పోలీసులతో సమన్వయం కోసం ప్రతి సంస్థ ఒక నోడల్ అధికారిని నియమించాలి.
డ్రగ్స్ వల్ల కలిగే ప్రమాదాలు, ఎన్‌డీపీఎస్ చట్టంలోని శిక్షలపై అవగాహన కల్పించే బోర్డులు, పోస్టర్లు క్యాంపస్‌లో తప్పనిసరిగా ప్రదర్శించాలి. ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో అధ్యాపకులు, హాస్టల్ వార్డెన్లు, విద్యార్థి ప్రతినిధులు, తల్లిదండ్రులు, స్థానిక పోలీసులతో కలిసి డ్రగ్స్ నివారణపై అవగాహన సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. యాంటీ డ్రగ్ కమిటీలు ఎప్పటికప్పుడు సెమినార్లు, వర్క్‌షాప్‌లు, కౌన్సెలింగ్ కార్యక్రమాలు నిర్వహించాలి.
విద్యాసంస్థలు, హాస్టళ్లలో అప్రమత్తంగా ఉండాలని, డ్రగ్స్ వినియోగం, విక్రయం, రవాణా లేదా అక్రమ రవాణాపై అనుమానం వచ్చినా వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని సూచించారు. డ్రగ్స్‌కు సంబంధించిన సమాచారం డయల్-112 లేదా 8712663333, 8712663236, 040-27853412 హెల్ప్‌లైన్ నంబర్లకు కూడా ఇవ్వవచ్చని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడంతో పాటు, పోలీసులు చేపట్టే దర్యాప్తులకు విద్యాసంస్థల యాజమాన్యాలు పూర్తిగా సహకరించాలని స్పష్టం చేశారు.
యాంటీ డ్రగ్ కమిటీ సమావేశాలు, అవగాహన కార్యక్రమాలు, తీసుకున్న చర్యల వివరాలను రికార్డులుగా నిర్వహించాల్సి ఉంటుంది. మాదకద్రవ్యాలకు సంబంధించిన చట్టవిరుద్ధ కార్యకలాపాల్లో పాల్గొన్న వారిపై ఎన్‌డీపీఎస్ చట్టం-1985 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించిన విద్యాసంస్థలపై కూడా సంబంధిత చట్టాల ప్రకారం చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఆదేశాలు జూన్ 26, 2026 నుంచి అమల్లోకి వచ్చాయని, తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కొనసాగుతాయని సైబరాబాద్ పోలీసు కమిషనర్ వెల్లడించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
