Telangana: ఒక్కొక్కరికి రూ.లక్ష 90 వేలు.. వారందరికీ చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం

|

Oct 07, 2024 | 6:20 PM

సింగరేణి కార్మికులకు దసరా పండగ ముందే వచ్చింది. మీ కష్టంతో వచ్చిన లాభాల్లో ఎక్కువ భాగం మీకే పంచుతున్నాం అంటూ.. ప్రకటించిన బోనస్‌ను కార్మికులకు అందించింది ప్రభుత్వం. కార్మికులకు బోనస్ చెక్కులను డిప్యూటీ సీఎం భట్టి అందజేశారు.

Telangana: ఒక్కొక్కరికి రూ.లక్ష 90 వేలు.. వారందరికీ చెక్కులు పంపిణీ చేసిన డిప్యూటీ సీఎం
Bhatti Vikramarka
Follow us on

2023 – 24 సంవత్సరానికి సింగరేణికి కార్మికులకు ప్రకటించిన బోనస్‌ను ప్రభుత్వం అందజేసింది. ప్రజాభవన్ వేదికగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. చెక్కును అందజేశారు. ఈ ఏడాదిలో సింగరేణికి 2412 కోట్లు రాగా.. అందులో 796 కోట్లను దసరా కానుకగా ప్రభుత్వం అందించింది. ఒక్కో కార్మికుడికి లక్ష 90 వేల రూపాయల బోనస్ ఇచ్చింది. సింగరేణి చరిత్రలోనే అత్యధిక బోనస్ ప్రకటించిన ప్రభుత్వం ఇదేనని భట్టి ప్రకటించారు. గతేడాదితో పోలిస్తే ఒక్కో కార్మికుడికి 20వేలు అదనంగా బోనస్ ఇచ్చామని ప్రభుత్వం ప్రకటించింది.

కాంట్రాక్ట్ కార్మికులకు రూ. 5వేలు

1998- 99 నుంచి సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా పంచే ఆనవాయితీ కొనసాగుతోంది. మొదట్లో పది శాతం వాటాను బోనస్‌గా ఇచ్చింది. గతేడాది 32శాతం బోనస్‌ను అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రభుత్వం మరో శాతం పెంచుతూ 33శాతాన్ని బోనస్ ఇస్తోంది. అంతే కాకుండా సింగరేణి చరిత్రలోనే మొదటిసారిగా కాంట్రాక్ట్ కార్మికులకు కూడా బోనస్ ప్రకటించారు. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో సంస్థలో ఉన్న 30వేల మంది కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్కొక్కరికి 5వేల చొప్పున ప్రయోజనం చేకూరింది.

గత ప్రభుత్వం లాభాలని దాచి అరకొర బోనస్‌లు ఇచ్చేది.. కానీ తమ ప్రభుత్వం అలా చేయడం లేదన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. లెక్కలన్నీ కార్మికుల ముందు ఉంచి.. బోనస్ ఇచ్చామన్నారు. సింగరేణిని కాపాడాలనే లక్ష్యంతో ముందుకు వెళ్లడమ తమ లక్ష్యమన్నారు డిప్యూటీ సీఎం భట్టి.

కార్మికుల సంక్షేమమే తమకు ముఖ్యమన్నారు. కాంట్రాక్ట్ కార్మికులకు కూడా మెరుగైన వేతనం అందేలా చూస్తామని హామీ ఇచ్చారు.
కార్మికులందరినీ సమానంగా చూడాలన్నారు. అంతే కాకుండా పండగకి ఒక రోజు ముందు.. అంటే ఈ నెల 11న ప్రతి సింగరేణి బొగ్గు బావి దగ్గర కార్మికులకు విందు ఏర్పాటు చేసి కార్మికులతో చర్చించి సింగరేణి భవిష్యత్తుపై ప్రణాళిక రూపొందించాలని భట్టి సూచించారు.

ఇక రిటైర్మెంట్ తర్వాత సింగరేణి కార్మికులకు సొంత ఇంటి విషయంలో ప్రభుత్వం నుంచి త్వరలోనే తీపి కబురు రాబోతోందన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. అంతే కాకుండా సింగరేణి ప్రాంతంలో వైద్య, విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు.

గతంలో ఎవరైనా కార్మికుడు ప్రమాదంలో చనిపోతే పరిహారం కోసం పోరాటం చేయాల్సిన పరిస్థితి. కానీ ఇప్పుడు కోటి రూపాయల బీమా పథకం తీసుకొచ్చామన్నారు మంత్రి శ్రీధర్‌బాబు. రాష్ట్రంలో మార్పుకు ఇదే సంకేతమన్నారు. ఉద్యోగ నియామకాల్లోనూ ఎలాంటి ప్రలోభాలు లేకుండా పారదర్శకంగా నిర్వహిస్తామన్నారు.

ఇటీవలే అమెరికా జపాన్ టూర్ ముగించుకుని వచ్చిన డిప్యూటీ బట్టి విక్రమార్క విదేశాల్లో ఉన్న మైనింగ్ టెక్నాలజీ.. అక్కడి సాంకేతికపై పరిశీలన చేశారు. ఇక్కడ కూడా అలాంటి మార్పు రావాలనీ.. కొత్త టెక్నాలజీని సింగరేణిలో ఉపయోగించాలని డిప్యూటీ సీఎం భట్టి సూచించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి