
హైదరాబాద్, జనవరి 26: దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్న వేళ తెలంగాణ కూడా సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. 75వ గణతంత్ర వేడుకల్లో భాగంగా హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్‌లో జాతీయ జెండా ఎగురవేసిన గవర్నర్ తమిళిసై.. రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా నడిచిన.. పదేళ్ల నియంతృత్వ పాలనను ప్రజలు గద్దెదింపారన్నారు. గత ప్రభుత్వ అసమర్థ విధానాలతో ఆర్థికస్థితి దిగజారిందన్నారు తమిళిసై. సామాన్యడికి గత ప్రభుత్వం అందుబాటులో లేదన్న గవర్నర్.. ప్రజల స్వేచ్ఛకు, హక్కులకు మా ప్రభుత్వం తొలి ప్రాధాన్యం ఇస్తుందన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు ప్రజా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు.
ప్రభుత్వానికి ఉండాల్సిన లక్షణాలు ధైర్యం, వివేకం, ఉత్సాహం అంటూ కామెంట్ చేశారు తమిళిసై. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా నిలిచిన యువతకు గత ప్రభుత్వం అన్యాయం చేసిందని విమర్శించారు. ఉద్యోగాల విషయంలో యువతకు ఎలాంటి అనుమానాలు అవసరం లేదు, టీఎస్పీఎస్సీని ప్రక్షాళన చేస్తున్నామని స్పష్టం చేశారు తమిళిసై. హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించింది. జాతీయ జెండాను ఆవిష్కరించారు గవర్నర్ తమిళిసై. అనంతరం సైనికుల గౌరవ వందనం స్వీకరించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..