Telangana Government: తెలంగాణలో మరో కొత్త పథకం.. వచ్చే నెల నుంచే ప్రారంభం.. వారికి డబుల్ బెనిఫిట్

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరిలో మరో కొత్త పథకాన్ని అమలు చేసేందుకు సిద్దమవుతోంది. ఇందుకు ఇప్పటినుంచే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహిళాభివృద్ది, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ పధకం అమలు జరగనుంది. ఈ పథకం పూర్తి వివరాలు..

Telangana Government: తెలంగాణలో మరో కొత్త పథకం.. వచ్చే నెల నుంచే ప్రారంభం.. వారికి డబుల్ బెనిఫిట్
Telangana Government

Updated on: Jan 18, 2026 | 8:41 AM

తెలంగాణ ప్రభుత్వం ఇటీవల వరుసగా కొత్త పథకాలు ప్రారంభిస్తోంది. కొద్ది రోజల క్రితం పిల్లల కోసం బాల భరోసా, వృద్దుల కోసం ప్రణామం పథకాలను ప్రారంభించింది. ప్రణామం పథకంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సీనియర్ సిటిజన్ల కోసం జిల్లాకో డే కేర్ సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇక బాల భరోసా పథకం ద్వారా ఐదేళ్లలోపు వయస్సు ఉన్న చిన్నారులందరికీ వైద్య పరీక్షలు నిర్వహించనుంది. దీని ద్వారా పిల్లల్లోని మానసిక, శారీరక వైకల్యాలను గుర్తించి సర్జరీలు ఉచితంగా ప్రభుత్వం చేయించనుంది. ఈ క్రమంలో పిల్లల కోసం మరో కొత్త పథకం ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ సిద్దమైంది. వచ్చే నెలలో స్కీమ్ ప్రారంభించనుంది. ఈ పథకం వివరాలు ఏంటి..? ఎవరికి లబ్ది జరగనుంది..? అనే వివరాలు చూద్దాం.

పిల్లలకు బ్రేక్ ఫాస్ట్

అంగన్‌వాడీల్లో ఇక నుంచి బ్రేక్ ఫాస్ట్ పథకం అమలు చేయనున్నారు. అంటే అంగన్‌వాడీలకు వచ్చే పిల్లలకు ఉదయం టిఫిన్ అందించనున్నారు. ఫిబ్రవరిలో ఈ పథకాన్ని సీఎం రేవంత్ ప్రారంభించనున్నారని తెలుస్తోంది. ఇందుకు తగిన సన్నాహాలు జరుగుతున్నాయి. తొలుత ప్రయోగాత్మకంగా హైదరాబాద్‌లోని 970 అంగన్‌వాడీ కేంద్రాల్లో పిల్లలకు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ అందించనున్నారు. ఇక్కడ సక్సెస్ అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35 వేల 781 అంగన్‌వాడీ కేంద్రాలకు కూడా విస్తరించనున్నారు. దీంతో మొత్తం 8 లక్షల మంది పిల్లలకు లబ్ది చేకూరనుంది. పిల్లలకు నాణ్యమైన పోషకాహారం బ్రేక్‌ఫాస్ట్‌లో వడ్డించనున్నారు. దీని వల్ల పిల్లల్లో రోగ నిరోధక శక్తి పెరగడంతో పాటు పోషకాహార లేమితో బాధపడే పిల్లలకు ఉపయోగపడనుంది.

టిఫిన్ ఏం పెడతారంటే..?

అంగన్‌వాడీల్లో పిల్లలకు ఏయే పదార్ధాలు బ్రేక్‌ఫాస్ట్‌లో చేర్చాలనే దానిపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి వచ్చింది. కిచిడీ, ఉప్మా వంటి టిఫిన్లు పెట్టనున్నారు. ఒక్కో రోజు ఒక్కో టిఫిన్ వడ్డిస్తారు. టీజీ ఫుడ్స్ ద్వారా వీటిని పిల్లలకు అందించనున్నారు. ఈ నెలలోనే బ్రేక్‌ఫాస్ట్ పథకం అమలు చేయాల్సి ఉన్నప్పటికీ.. మేడారం జాతర పనుల్లో ప్రభుత్వం బిజీగా ఉంది. దీంతో ఫిబ్రవరిలో ఈ పథకాన్ని ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చారు. తొలుత హైదరాబాద్‌లోని ఖైరతాబాద్, సికింద్రాబాద్, నాంపల్లి, చార్మినార్, గొల్కోండ ప్రాంతాల్లోని 970 అంగన్‌వాడీల్లో అమలు చేయనున్నారు. దీని వల్ల 15 వేల మంది పిల్లలకు ప్రయోజనం చేకూరనుంది. ఇప్పటికే అంగన్‌వాడీల్లో చిన్నారలు కోసం మధ్యాహ్న భోజనం, బాలఅమృతం వంటి పథకాలను ప్రభుత్వం అమలు చేస్తోంది. ఇక బ్రేక్ ఫాస్ట్ పథకం ద్వారా చిన్నారులకు మరిన్ని పోషకాలు లభించనున్నాయి. ప్రతిష్టాత్మకంగా ఈ పథకాన్ని అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమవుతోంది.