
తెలంగాణ ప్రభుత్వం గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలోని మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణాన్ని అందుబాటులోకి తెచ్చిన విషయం తెలిసిందే. మహాలక్ష్మి పథకం పేరుతో దీనిని అమలు చేస్తోంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా మహిళలు ఎక్కడినుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం చేయగలుగుతున్నారు. మహిళలు ఆధార్ కార్డు చూపించిన తర్వాత కండక్టర్ నుంచి జీరో టికెట్ తీసుకుని ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీగా ప్రయాణించవచ్చు. అయితే కొంతమంది మహిళల ఆధార్ కార్డుల్లో పాత ఫొటోలు ఉండటంతో కండక్టర్లు అలాంటి వారిని నిర్ధారించుకోవడం కష్టంగా మారింది. ఈ విషయంలో కండక్టర్లు, మహిళల మధ్య వాగ్వాదాలు చోటుచేసుకున్న ఘటనలు కూడా రాష్ట్రవ్యాప్తంగా జరగడంతో ఇవి ప్రభుత్వ దృష్టికి వెళ్లాయి. దీంతో ఈ సమస్యను తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
మహిళలు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని పొందేందుకు ప్రభుత్వం ప్రత్యేక స్మార్ట్ కార్డులను త్వరలో జారీ చేయాలని నిర్ణయించింది. ఇందుకోసం సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌తో కీలక ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థ సహాకరంతో ప్రతీ మహిళకు ప్రత్యేక కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్డును రాష్ట్రంలోని మహిళలందరికీ వీలైనంత త్వరగా పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కార్డు చూపించి మహిళలు ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించవచ్చు. ఆధార్ కార్డు చూపించి టికెట్ తీసుకోవాల్సిన అవసరం లేదు. టికెట్ లేకుండానే ఈ కార్డు చూపించి ఎక్కడికైనా వెళ్లోచ్చు.
ఆదివారం ప్రజాభవన్‌లో ఆర్టీసీ అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అర్హులైన మహిళలందరికీ త్వరగా స్మార్ట్ కార్డులు చేరేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అలాగే త్వరలో పీఎం ఈ డ్రైవ్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్‌కు 2,800 ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని, ఇక వరంగల్‌కు 100 ఎలక్ట్రిక్ బస్సులు వస్తాయిన వివరించారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఆర్టీసీకి రూ.255 కోట్ల లాభం వచ్చిందన్నారు. మహిళలు మరింత సులభతరంగా బస్సుల్లో ఫ్రీ జర్నీ సౌకర్యం ఉపయోగించుకునేందుకు స్మార్ట్ కార్డులు ఉపయోగపతాయని అన్నారు.