
రైతులు యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కొకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం యూరియా బుకింగ్ యాప్‌ను గతంలో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. తొలి విడతలో ప్రయోగాత్మకంగా ఐదు జిల్లాల్లో మాత్రమే ఈ యాప్ సేవలు అందించగా.. రాష్ట్రవ్యాప్తంగా విస్తరించేందుకు ప్రభుత్వం సిద్దమైంది. ఇందుకోసం ముహూర్తం కూడా ఫిక్స్ చేసింది. వచ్చే యాసంగి సీజన్ నుంచి రాష్ట్రవ్యాంగా యూరియా బుకింగ్ యాప్‌ను అమలు చేయనన్నారు. ఈ మేరకు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తాజాగా ప్రకటించారు. రైతులకు అవసరమైన సమయంలో వెంటనే యూరియా అందించడంతో పాటు కొరతను నివారించేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. రైతులు క్యూలైన్లలో నిల్చోని యూరియా కోసం ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా వారి సమయాన్ని ఆదా చేసేందుకు ఈ యాప్ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా త్వరలో ఇది అమల్లోకి తీసుకొస్తున్నామని, దీని వల్ల యూరియా కొరత వల్ల రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఉండదని తుమ్మల స్పష్టం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ పేరుతో రైతులు ఇంటి వద్దనే మొబైల్ నుంచి యూరియా బుకింగ్ చేసుకునే సౌకర్యం తీసుకొచ్చింది. ఈ యాప్ ద్వారా రైతులు తమ సమీపంలోని డీలర్ల వద్ద యూరియా నిల్వలను తెలుసుకోవచ్చు. యాప్ ద్వారా ముందుగా డీలర్లను ఎంచుకుని బుకింగ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత నేరుగా డీలర్ వద్దకు వెళ్లి తమ పంటకు కావాల్సిన యూరియా తెచ్చుకోవచ్చు. దీని వల్ల షాపుల వద్ద వెయిట్ చేయాల్సిన అవసరం అనేది ఉండదు. తమ పంటకు ఎంత యూరియా అవసరమవుతుందో అంత మాత్రమే అందిస్తారు. దీని వల్ల బ్లాక్ మార్కెట్ దందా, అధిక ధరలకు యూరియా విక్రయించడం వంటివి తగ్గుతాయి. ఈ యాప్ రాష్ట్రంలోని రైతులందరికీ బాగా ఉపయోగపడుతుంది. రైతుల నుంచి అద్భుత స్పందన లభిస్తోంది. దీంతో రాష్ట్రవ్యావ్యాప్తంగా అమలు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది.
ఇప్పటివరకు ఫెర్టిలైజర్ బుకింగ్ యాప్ ద్వారా 14.29 లక్షల మంది రైతులు యూరియా బుక్ చేసుకున్నారు. వీళ్లు దాదాపు 56.86 లక్షల బస్తాల యూరియాను బుక్ చేసుకున్నారు. ఇందులో 51.47 లక్షల బస్తాలను రైతులకు సకాలంలో పంపిణీ చేశారు. రైతుల నుంచి ఈ యాప్‌కు అద్భుత స్పందన వస్తుందని, యూరియా కోసం ఇబ్బంది పడే పరిస్ధితులు కూడా తగ్గాయని తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. దీనిని రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడం వల్ల యూరియా కోసం భవిష్యత్తులో ఇబ్బందులు పడే పరిస్ధితులు ఉండవని ఆశిస్తున్నట్లు తెలిపారు.