Telangana: పేదలకు పండగ లాంటి వార్త.. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయ్

|

Mar 02, 2024 | 9:51 AM

ఆరు గ్యారంటీలు అందుకోవాలంటే.. వైట్ రేషన్ కార్డు మస్ట్‌గా ఉండాలి. అందుకే అన్ని అర్హతలున్నా.. కేవలం తెల్ల రేషన్‌కార్డు లేకపోవడంతో ఆ పథకాలను అందులేకపోతున్న వారిపై సర్కార్ ఫోకస్ పెట్టింది. ప్రస్తుతం పెండింగ్‌లో 9 లక్షల వరకు రేషన్‌కార్డుల దరఖాస్తులు ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి.

Telangana: పేదలకు పండగ లాంటి వార్త.. కొత్త రేషన్ కార్డులు వస్తున్నాయ్
New Ration Cards
Follow us on

తెలంగాణలో ఏళ్లుగా గంపెడాశలతో ఎదురుచూస్తున్న పేదల కల తీరబోతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియకు శ్రీకారం చుట్టేందుకు రెడీ అయ్యింది. గత యేడాది డిసెంబర్‌ 28 నుంచి కొత్త రేషన్‌కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరించింది. దీంతో పాటు ఇప్పటికే ఉన్న రేషన్ కార్డుల్లో మార్పులు, చేర్పులూ, తప్పులు సరిచేయడం వంటి అంశాలకు కూడా దరఖాస్తులు స్వీకరించారు. దారిద్రరేఖకు దిగువన ఉన్న అర్హులైన వారిని గ్రామసభలోనే గుర్తించి, కొత్తరేషన్‌ కార్డుదారులను ఎంపిక చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

గత ప్రభుత్వ హయాంలో ఆరేళ్లుగా ఒక్క కొత్త రేషన్‌కార్డు జారీ కాలేదు. ఉన్న కార్డుల్లో పేర్ల నమోదుకు కూడా అవకాశం ఇవ్వలేదు. దరఖాస్తు చేసుకున్నవారికి ఎదురుచూపులే మిగిలాయి. రేషన్ కోసమే కాకుండా, ఆరోగ్యశ్రీ వంటి సేవలకూ రేషన్ కార్డులు తప్పనిసరి అయ్యాయి. కొత్తగా రేషన్ కార్డులు జారీ చేయకపోవడంతో లక్షలాది మంది పేదలు ఆయా సేవలు అందుకోలేకపోతున్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆరోగ్యశ్రీ పథకం కింద పరిమితిని 10 లక్షలకు పెంచింది. అర్హులైన పేద ప్రజలకు రేషన్‌ కార్డులు లేక, ఉన్న వాటిల్లో పేర్ల నమోదుకు అవకాశం దక్కక లక్షలాది మంది పేదలు ఆరోగ్యశ్రీ పథకాన్ని వినియోగించుకోలేకపోతున్నారు.

ఒక్కో జిల్లా నుంచి కొత్త రేషన్ కార్డుల కోసం ఇప్పటికే సుమారు 50 వేల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో పాటు ఆహారభద్రత కార్డుల్లో పిల్లల పేర్ల నమోదు కోసం ఆయా జిల్లాల్లో 60 వేల నుంచి 90 వేల వరకు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ లెక్కన రాష్ట్రవ్యాప్తంగా మరో 9 లక్షల వరకూ రేషన్‌కార్డు దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో అర్హులైన అందరికి వైట్ రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ సర్కార్ కసరత్తు మొదలుపెట్టింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.