She Taxi: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వారికోసం ప్రత్యేక శిక్షణ..

|

Jun 07, 2022 | 5:57 AM

She Taxi: షీ ట్యాక్సీ విషయంలో మరో కీలక ముందడుగు వేసింది తెలంగాణ సర్కార్. షీ ట్యాక్సీ నడపాలనుకున్న వారికి, ప్రత్యేకంగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది.

She Taxi: తెలంగాణ సర్కార్ మరో కీలక నిర్ణయం.. వారికోసం ప్రత్యేక శిక్షణ..
Telangana
Follow us on

She Taxi: షీ ట్యాక్సీ విషయంలో మరో కీలక ముందడుగు వేసింది తెలంగాణ సర్కార్. షీ ట్యాక్సీ నడపాలనుకున్న వారికి, ప్రత్యేకంగా డ్రైవింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేసింది. ఉపాధి కల్పనతో పాటు నగరంలో మహిళలకు రక్షణ కల్పించడానికి, తెలంగాణ ప్రభుత్వం షీ ట్యాక్సీ పథకాన్ని తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ట్యాక్సీ నడుపుకునే మహిళలకు వాహనాల కొనుగోలు కోసం సబ్సిడీ అందించనుంది. అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులను కూడా స్వీకరించారు. తొలిసారిగా షీ ట్యాక్సీ ప్రవేశపెట్టిన హైదరాబాద్‌లో, తాజాగా మరో ముందడుగు పడింది. కూకట్‌పల్లి ఆల్విన్‌కాలనీలో షీ టాక్సీ డ్రైవర్ల శిక్షణ కొరకు, ప్రత్యేకంగా డ్రైవింగ్ ట్రాక్‌ను ఏర్పాటు చేశారు అధికారులు. ఆ డ్రైవింగ్‌ ట్రాక్‌ను మహిళ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రారంభించారు. ఇక్కడ మహిళలకే కాకుండా థర్డ్‌ జెండర్లకు కూడా డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వడం ప్రత్యేకత.

ఈ ట్రాక్‌లో ద్విచ్రవాహనాలు, ఆటోలు, కార్ల డ్రైవింగ్‌లో శిక్షణ ఇవ్వనున్నారు. శిక్షణ ఇచ్చే వాహనాలను పరిశీలించారు మంత్రి సత్యవతి రాథోడ్. ముఖ్యమంత్రి కేసీఆర్, మహిళల కోసం ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారని వివరించారు. ప్రభుత్వం అందిస్తోన్న ప్రోత్సాహాన్ని అందిపుచ్చుకొని, ప్రగతి బాటలో పయనించాలని సూచించారు. మహిళలకు వాహనాలు ఇచ్చాక కూడా, ప్రభుత్వం తోడుగా ఉంటుందని భరోసా ఇచ్చారు, మంత్రి సత్యవతి. 10వ తరగతి అర్హత ఉండి, 18 ఏళ్లు నిండిన మహిళలకు ఈ పథకం ద్వారా ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వం ప్లాన్‌ చేసింది. ఈ పథకం ద్వారా ఎంపికైన మహిళలకు 35 శాతం సబ్సిడీ, 10 శాతం మార్జిన్‌ అమౌంట్‌తో, మొత్తం 45 శాతం బ్యాంకు రుణంతో ట్యాక్సీలను అందించనున్నారు. డ్రైవింగ్‌ శిక్షణలో అర్హత సాధించిన మహిళలకు వాహనాలను అందించనున్నట్టు చెబుతున్నారు అధికారులు.