
హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ప్రాణ హాని ఉందని తెలంగాణ సర్కార్ నిర్ధారించింది. దీంతో వై ప్లస్ భద్రత కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన ఆర్డర్స్.. శుక్రవారం రాత్రి వెలువడ్డాయి. తనకు ప్రాణ హాని ఉందని ఈటల ఇటీవల ప్రెస్ మీట్‌లో చెప్పారు. ఆయన భార్య జమున కూడా ఇదే విషయాన్ని మరోసారి నొక్కి చెప్పారు. ఈ క్రమంలో టీవీ బిగ్ న్యూస్ బిగ్ డిబేట్‌లో టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజినీకాంత్ ఈ విషయాన్ని ప్రస్తావించగా.. ఈటల సెక్యూరిటీ బాధ్యత తనది అని చెప్పుకొచ్చారు. కేటీఆర్ ఆదేశాలతో డీజీపీ రంగంలోకి దిగారు. సీనియర్ ఐపీఎస్ సందీప్ రావుతో ఈటలకు ఎంత వరకు ముప్పు ఉందన్న అంశంపై అంచనా వేయించారు. ఒకటికి రెండు సార్లు ఈటల ఇంటికి వెళ్లిన డీసీపీ సందీప్ రావు.. కుటుంబ సభ్యుల నుంచి వివరాలు సేకరించడంతో పాటు.. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలియతిరిగారు.
ఓవరాల్ రిపోర్ట్‌ను సీల్డ్ కవర్‌లో డీజీపీకి అందజేశారు సందీప్ రావు. మొత్తంగా ఈటలకు ప్రాణహాని ఉందని నిర్ధారణ అయ్యింది. ఈ రిపోర్ట్ ఆధారంగా ఈటలకు వై ఫ్లస్ కేటగిరీ భద్రత కల్పిస్తూ తెలంగాణ సర్కార్ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై మొత్తం 11 మంది భద్రతా సిబ్బంది.. ఈటలకు సెక్యూరిటీ ఇవ్వనున్నారు. ఐదుగురు బాడీగార్డ్స్ ఎప్పుడూ ఈటల రాజేందర్ వెంట ఉంటారు. మరో ఆరుగురు పర్సనల్ సెక్యూరిటీ ఆఫీసర్స్.. షిఫ్ట్‌కు ఇద్దరు చొప్పున.. మూడు షిఫ్టుల్లో ఆయనకు భద్రత కల్పిస్తారు. శనివారం ఉదయం నుంచి స్టేట్ కేటగిరీ వై ఫ్లస్ భద్రతతో పాటు.. బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ కూడా ఆయనకు అందుబాటులో ఉండనుంది. కాగా ఇప్పటి వరకు ఈటలకు 2 ప్లస్ 2 భద్రత మాత్రమే ఉండేది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి..