తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి.. స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు మరో ముందడుగు!
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్, వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారం, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్‌ల ప్రోత్సాహం వంటి కీలక అంశాల్లో కలిసి పని చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక–2026 సమావేశాల సందర్భంగా దావోస్‌లో, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి గూగుల్..

భారత్ ఫ్యూచర్ సిటీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేసేందుకు తెలంగాణతో కలిసి పనిచేయడానికి యూఏఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి హెచ్.ఈ. అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ తెలిపారు. ప్రపంచ ఆర్థిక వేదిక –2026 సదస్సులో భాగంగా దావోస్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డితో యూఏఈ మంత్రి మంగళవారం భేటీ అయ్యారు. ‘తెలంగాణ రైజింగ్’ ప్రతినిధి బృందంతో కలిసి రాష్ట్రంలో చేపట్టే భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ముఖ్యంగా భారత్ ఫ్యూచర్ సిటీపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్ ను వివరించారు. 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యమని చెప్పారు.
భారత్ ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్ అభివృద్ధి అవకాశాలపై సీఎం ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇది దేశంలోనే తొలి నెట్-జీరో గ్రీన్‌ఫీల్డ్ స్మార్ట్ సిటీగా రూపుదిద్దుకోనుందని తెలిపారు. సుమారు 30 వేల ఎకరాల్లో విస్తరించే ఈ నగరంలో ఏఐ, విద్య, ఆరోగ్యం, పరిశ్రమలు, నివాస, వినోద రంగాలకు ప్రత్యేక జోన్లు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. ఈ ప్రాజెక్ట్ లో ఇప్పటికే మారుబేని, సెమ్ కార్ప్ వంటి అంతర్జాతీయ సంస్థలు భాగస్వాములుగా ఉన్నాయని, ఇటీవలే రిలయన్స్ గ్రూప్ వంతారాతో ఫ్యూచర్ సిటీలో కొత్త జూ ఏర్పాటు కోసం అవగాహన ఒప్పందం కుదిరిందని సీఎం వెల్లడించారు.
తెలంగాణతో వ్యూహాత్మక భాగస్వామ్యం ఏర్పాటుకు తమ ప్రభుత్వం ఆసక్తిగా ఉందని అబ్దుల్లా బిన్ తౌక్ అల్ మార్రీ తెలిపారు. ప్రాజెక్ట్ వేగవంతమయ్యేందుకు రెండు ప్రభుత్వాల అధికారులతో సంయుక్త టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. యూఏఈ ఫుడ్ క్లస్టర్‌తో తెలంగాణ కలిసి పనిచేసి గ్రామీణ, వ్యవసాయ ఆధారిత ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాలన్న ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ తరఫున ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తదితర అధికారులు పాల్గొన్నారు.
తెలంగాణతో భాగస్వామ్యానికి గూగుల్ ఆసక్తి
ప్రపంచ టెక్ దిగ్గజం గూగుల్, వివిధ రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో భాగస్వామ్యానికి ముందుకొచ్చింది. వ్యవసాయం, వాతావరణ మార్పు, పట్టణ కాలుష్య సమస్యల పరిష్కారం, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్‌ల ప్రోత్సాహం వంటి కీలక అంశాల్లో కలిసి పని చేసేందుకు ఆసక్తి వ్యక్తం చేసింది. ప్రపంచ ఆర్థిక వేదిక–2026 సమావేశాల సందర్భంగా దావోస్‌లో, ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డి గూగుల్ ఆసియా పసిఫిక్ ప్రాంత అధ్యక్షుడు సంజయ్ గుప్తాతో సమావేశమయ్యారు. భేటీలో వాతావరణ మార్పుల ప్రభావం, వ్యవసాయ రంగంపై దాని ప్రభావం, పట్టణ ప్రాంతాల్లో పెరుగుతున్న కాలుష్య సమస్యలపై విస్తృతంగా చర్చలు జరిగాయి. ఈ సమస్యలకు సాంకేతిక పరిష్కారాలు, డేటా ఆధారిత విధానాలతో సమాధానాలు కనుగొనే అంశంపై ఇరుపక్షాలు ఏకాభిప్రాయానికి వచ్చాయి.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ప్రాంతీయ ఆర్థిక వృద్ధికి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న CURE, PURE, RARE అభివృద్ధి నమూనాలను గూగుల్ బృందానికి వివరించారు. కోర్ హైదరాబాద్‌ను కాలుష్య రహిత నగరంగా అభివృద్ధి చేయాలనే ప్రణాళికలను వివరించారు. ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, స్టార్టప్ ఇన్నోవేషన్‌కు మరింత మద్దతు వంటి రంగాల్లో గూగుల్ సాంకేతిక సహకారం అందించే అవకాశాలపై చర్చించారు. హైదరాబాద్‌లో తొలి ‘గూగుల్ ఫర్ స్టార్టప్స్ హబ్’ ఏర్పాటు చేసినందుకు గూగుల్ బృందానికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు. ఇది రాష్ట్రంలో స్టార్టప్ ఎకోసిస్టమ్‌కు కీలక మైలురాయిగా మారిందని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగంలో ఎరువుల అతిగా వినియోగం వల్ల ఏర్పడుతున్న సమస్యలు, రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరాన్ని సీఎం ప్రస్తావించారు. సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో గూగుల్ సాంకేతిక పరిష్కారాలు ఉపయోగపడతాయని తెలిపారు. గూగుల్ ఏపీఏసీ ప్రెసిడెంట్ సంజయ్ గుప్తా మాట్లాడుతూ, ట్రాఫిక్ నియంత్రణ, సైబర్ సెక్యూరిటీ, వ్యవసాయం, స్టార్టప్‌లు, వాతావరణ మార్పు అంశాల్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో మద్దతు అందించేందుకు గూగుల్ సిద్ధంగా ఉందని చెప్పారు. సమావేశంలో పాల్గొన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, బీఎఫ్ఎస్ఐ స్కిల్లింగ్, ఖాన్ అకాడమీ, ఫిజిక్స్ వాలాతో భాగస్వామ్యం, ఏఐ పాఠ్యాంశాల అమలు వంటి కార్యక్రమాలను ప్రస్తావించారు. పాఠశాలలకు ఉచిత విద్యుత్ సరఫరా, టీ-ఫైబర్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ అందిస్తున్నట్లు తెలిపారు.




