
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అత్యంత వెనుకబడిన కూలాలు(ఎంబీసీ) జాబితాలో మరో 14 కులాలను కలపనుంది. ప్రస్తుతం మోస్ట్ బ్యాక్‌వర్డ్ క్లాసెస్ లిస్టులో 36 కూలాలు ఉన్నాయి. వీటిల్లో మరో 14 కులాలను కలపనున్నారు. దీంతో ఎంబీసీ లిస్టులో కులాల సంఖ్య 50కి చేరుకుంది. ఈ మేరకు ఇటీవల కేంద్రానికి బీసీ కమిషన్ లేఖ రాయగా.. త్వరలోనే కేంద్రం దీనిని నోటిఫై చేయనుంది. ఆ తర్వాత డీ నోటిఫైడ్ ట్రైబల్ పేరుతో ఎంబీసీలకు కేంద్రం సర్టిఫికేట్లు జారీ చేయనుంది.
ఫకీర్, గుడ్డి ఏలుగు, సిక్లింగర్, సిద్దుల, దాసరి, జంగం, చుండువాళ్లు, బుక్క అయ్యావారాస్, రాజానాల, వాల్మికి బోయ, పంబాల, తల్యారీ, యాట, కునపులి
తమను కూడా అత్యంత వెనుకబడిన కులాల జాబితాలో చేర్చాలని ఆయా కులాల నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్లు వచ్చాయి. ఈ డిమాండ్లను పరిశీలించిన రేవంత్ సర్కార్.. కొత్తగా 14 కులాలను మెస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్(ఎంబీసీ) జాబితాలో చేర్చాలని కేంద్రానికి లేఖ రాసింది. తెలంగాణలో మొత్తం 11 లక్షల మంది ఎంబీసీలు ఉన్నట్లు గతంలో రాష్ట్రం చేపట్టిన కులగణన సర్వేలో వెల్లడైంది. ఈ జాబితాలో సగం మందికిపైగా జనం వడ్డెర, బోయ వాళ్లే ఉన్నారు. దీంతో మిగతావారికి కూడా ప్రభుత్వ ప్రయోజనాల అందాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అత్యంత వెనుకబడిన కులాల జాబితా పంపాలని ఇటీవల కేంద్ర ప్రభుత్వ సామాజిక మంత్రిత్వశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. దీంతో ఈ జాబితాలో మరిన్ని కులాలను చేర్చాలని కేంద్రానికి తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసింది.
అత్యంత వెనుకబడిన కులాల లిస్ట్‌లో ఉన్నవారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు అమలు చేస్తున్నాయి. కేంద్రం స్కీమ్ ఫర్ ఎకనామిక్ ఎంపవర్‌మెంట్ ఆఫ్ డీఎన్టీస్ అనే పథకం కింద లబ్ది చేకూర్చుతోంది. వీరికి ఆరోగ్యం, హౌసింగ్, విద్యలో ఆర్ధిక సాయం అందిస్తోంది. దీంతో సొంత ఇంటిని నిర్మించుకోవాలనుకునేవారికి ఆర్ధిక సాయం, విద్యార్థులకు ఉచిత కోచింగ్, స్వయం ఉపాధి పొందాలనుకునేవారికి తక్కువ వడ్డీకే బ్యాంకు రుణాలు, కుటుంబసభ్యులకు మెరుగైన వైద్య సదుపాయం లాంటి బెనిఫిట్స్ పొందనున్నారు. దీని వల్ల రాష్ట్రంలోని 11 లక్షల మందికి ప్రయోజనం జరగనుంది. ఇప్పటివరకు వీళ్లు పేదరికంలో మగ్గుతున్నా ఎంబీసీ జాబితాలో లేకపోవడంతో కేంద్ర ప్రభుత్వ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఇక సంచార జీవనం గడిపేవారికి శాశ్వత చిరునామా లేకపోవడం వల్ల పథకాలు పొందలేకపోతున్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయంతో ఈ సంచార జాతులకు లబ్ది కలగనుంది.