Mohammad Azharuddin: మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయించిన ప్రభుత్వం

కొందరికి ఇది ఊహించని పరిణామం. మరికొందరికి అనూహ్య పరిణామం. ఏదైతే ఏంటి.. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల వేళ కాంగ్రెస్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎత్తుగడలో భాగమా? మరొకటా? తెలియదు.. మాజీ క్రికెటర్‌ అజరుద్దీన్‌కు మంత్రివర్గంలో చోటు కల్పించింది. తాజాగా ఆయనకు శాఖలు కేటాయించింది ప్రభుత్వం...

Mohammad Azharuddin: మంత్రి అజారుద్దీన్‌కు శాఖలు కేటాయించిన ప్రభుత్వం
Azharuddin

Updated on: Nov 04, 2025 | 2:48 PM

ఇటీవల మంత్రిగా తెలంగాణ కేబినెట్‌లో చేరిన అజారుద్దీన్‌ తాజాగా శాఖలు కేటాయించారు సీఎం. మైనార్టీల సంక్షేమం, పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజెస్‌ శాఖలను కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మినిస్టర్‌గా అజారుద్దీన్‌ గత నెల 31న ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్‌భవన్‌లోని దర్బార్‌ హాల్‌లో జరిగిన కార్యక్రమంలో గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ.. ఆయనతో ప్రమాణం చేయించారు.

ఖాళీగా ఉన్న మూడు స్థానాల్లో ఒకదాన్ని.. కాంగ్రెస్‌ అధిష్ఠానం భర్తీ చేసింది. ముఖ్యమంత్రి సిఫారసుతో, రాష్ట్ర మంత్రిగా మాజీ క్రికెటర్‌ మహ్మద్‌ అజరుద్దీన్‌తో ప్రమాణం చేయించారు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ. దీంతో మాజీ క్రికెటర్‌ కాస్తా… ఏ చట్టసభలోనూ సభ్యుడు కాకుండానే మంత్రయిపోయారు. ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి, మంత్రులు సమక్షంలో రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన అజరుద్దీన్‌.. హై కమాండ్ కు ధన్యవాదాలు తెలిపారు. తనను నమ్మి అవకాశం కల్పించారన్న అజర్‌.. తనకు సపోర్ట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఇండియన్‌ క్రికెట్ చరిత్రలో మహ్మద్ అజరుద్దీన్‌ది అంతులేని కథ. అత్యంత ప్రతిభావంతుల్లో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఈ వెటరన్‌ క్రికెటర్‌ని.. అంతేస్థాయిలో వివాదాలు చుట్టుముట్టాయి. తీవ్ర ఆరోపణలతో ఆట నుంచి వైదొలిగిన ఈ మణికట్టు మాంత్రికుడు.. రాజకీయాల్లోనూ రాణించి.. మధ్యలో డక్కాముక్కీలు తిని, ఇప్పుడు సరికొత్త ఇన్నింగ్స్‌ మొదలెట్టారు. ఒకనాడు హైదరాబాదీగా ఇండియన్‌ క్రికెట్‌లో ఓ వెలుగు వెలిగిన అజర్.. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే, క్రికెట్ మైదానం నుంచి రాజకీయ అధికార కేంద్రం దాకా.. ఆయన ప్రయాణం ఎన్నో ఎత్తుపల్లాలను, ఊహించని మలుపులనూ చూసిందని చెప్పొచ్చు. ఆట నుంచి నేటి అమాత్య పదవి వరకు ఆయనను చుట్టుముట్టిన వివాదాలు, విషాదాలు అలాంటివి మరి.

అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంభంలోనే అదుర్స్‌

1984లో ఇంగ్లాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన అజరుద్దీన్‌… ఆరంభంలోనే అదరగొట్టేశాడు. మొదటి మూడు టెస్టుల్లో వరుస సెంచరీలు సాధించిన ఏకైక ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు. తన మణికట్టు మాయాజాలంతో ప్రపంచ క్రికెట్ అభిమానులను మంత్రముగ్ధుల్ని చేసిన అజర్‌.. 90వ దశకంలో భారత జట్టుకు సారథ్యం వహించి, అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో ఒకరిగా నిలిచారు. వరుసగా మూడు వరల్డ్‌ కప్‌లలో టీమిండియాకు సారథ్యం వహించారంటేనే.. ఆటలో ఆయనస్థాయి ఏంటో అర్థం చేసుకోవచ్చు.

99టెస్టులు.. అజర్‌ కీర్తికి ఫిక్సింగ్‌ బ్రేకులు

ఇండియన్‌ టీమ్‌ తరపున.. 99 టెస్ట్ మ్యాచ్‌లు ఆడి అపారమైన కీర్తిని సంపాదించుకున్న అజార్ కెరీర్‌కు… మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు బ్రేకులు వేశాయి. 2000 సంవత్సరంలో కల్లోలం సృష్టించిన ఫిక్సింగ్‌ వ్యవహారంలో.. అజర్‌ దోషిగా తేలడంతో, బీసీసీఐ జీవితకాల నిషేధం విధించింది. భారత క్రికెట్ చరిత్రలోనే ఇదో చీకటి అధ్యాయంగా చెప్పవచ్చు. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత… 2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఈ నిషేధాన్ని రద్దు చేసినప్పటికీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. క్రికెటర్‌గా అజర్‌ కెరీర్‌ ముగిసిపోయింది.

2009లోనే పొలిటికల్‌ ఎంట్రీ.. మొరాదాబాద్‌ ఎంపీగా గెలుపు

క్రికెట్‌కు దూరమైన అజారుద్దీన్… 2009లో కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. హైదరాబాదీ అయినప్పటికీ.. ఆయనకు దేశవ్యాప్తంగా ఫేమ్‌ ఉండటంతో, 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ ఎంపీ స్థానం నుంచి బరిలో నిలిచి గెలిచారు. అయితే, 2014లో రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఆ తర్వాత సొంత రాష్ట్రం తెలంగాణకు వచ్చిన అజర్‌.. 2018లో TPCC వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు చేపట్టారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుంచి పోటీచేసి ఓడిపోయారు.

జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నిక పోటీకి ఆసక్తి

అయితే, ఇటీవల జూబ్లీహిల్స్ సిట్టింగ్‌ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌ చనిపోవడంతో.. మరోసారి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఆసక్తి చూపించారు. అయితే, ఆయనను అనూహ్యంగా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్‌ చేసిన కాంగ్రెస్‌ పార్టీ… ఇప్పుడు మంత్రిగానూ అవకాశం ఇచ్చింది. కేబినెట్‌లో మైనారిటీ వర్గానికి ప్రాతినిధ్యం కల్పించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్టు కాంగ్రెస్‌ వర్గాలు చెబుతున్నప్పటికీ.. ఇది ఓట్ల రాజకీయం అంటోంది బీజేపీ. మొదట్నుంచీ హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడే అజరుద్దీన్‌కి.. మంత్రివర్గంలో అవకాశం ఇచ్చారంటూ దుమ్మెత్తిపోస్తోంది.

పర్సనల్‌ లైఫ్‌లోనూ పల్టీలు కొట్టిన అజర్‌

ప్రొఫెషనల్‌ అండ్‌ పొలిటికల్‌ లైఫ్‌లోనే కాదు.. పర్సనల్‌ లైఫ్‌లోనూ అజర్‌ను వివాదాలు వెంటాడాయి. హైదరాబాదీ అయిన మొదటి భార్యకు విడాకులిచ్చి బాలీవుడ్ నటి సంగీతా బిజ్లానీని వివాహం చేసుకున్న అజర్‌.. ఆమెతో ప్రయాణానికి కూడా డైవర్స్‌తో ముగింపు పలికాడు. బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌ గుత్తా జ్వాలతో ఆయన రిలేషన్‌లో ఉన్నారనే ప్రచారమూ జరిగింది. ఆ మధ్య రోడ్డు ప్రమాదంలో కుమారుణ్ని కోల్పోవడం.. అజర్‌ జీవితంలో అతిపెద్ద విషాదాన్ని నింపింది. ఇక, హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడిగా గతంలో కీలకంగా వ్యవహరించిన అజరుద్దీన్‌.. అందులోనూ అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలు వచ్చాయి. దాదాపు 20కోట్ల నిధుల దుర్వినయోగం చేశారంటూ.. ఆయనపై ఈడీ కేసు నమోదు చేసింది. ఇప్పుడు ఈ అంశాలన్నీ ఉటంకిస్తూ… మంత్రిగా అజర్‌ నియమాకాన్ని తప్పుబడుతోంది బీజేపీ. అయితే అవన్నీ ఆరోపణలేననీ.. ఇంకా నిరూపణ కాలేదనీ వాదిస్తోంది కాంగ్రెస్‌.

అజర్‌ దేశఖ్యాతిని పెంచారంటున్న కాంగ్రెస్‌

హైదరాబాదీగా ఇండియన్‌ టీమ్‌కు ప్రాతినిథ్యం వహించి.. అజర్‌ దేశఖ్యాతిని పెంచాడని కాంగ్రెస్‌ అంటుంటే.. మ్యాచ్‌ ఫిక్సింగ్‌తో దేశానికి చెడ్డపేరు తెచ్చారనీ, HCAలో అక్రమాలకు పాల్పడ్డారని బీజేపీ అంటోంది. ఎవరి వాదన ఎలా ఉన్నా… అజర్‌ ఇప్పుడు మినిస్టర్‌ అయిపోయారు. మరి, ఈ వ్యవహారం ఇంతటితో సద్దు మణుగుతుందా? లేదా? అన్నదే ఆసక్తిరేపుతోంది.