కాంగ్రెస్ ప్రభుత్వం ఇంకా కొలువుదీరలేదు. అప్పుడే ప్రతిపక్షాల నుంచి విమర్శలు మొదలయ్యాయి, బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మూడో సారి ఎన్నికైన తెలంగాణ అసెంబ్లీ తొలిసారి సమావేశం కాబోతోంది. శనివారం ఉదయం జరిగే అసెంబ్లీ భేటీలో సీఎం రేవంత్ రెడ్డితో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు అంతా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ ప్రత్యేక అసెంబ్లీ భేటీకి ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ వ్యవహరించబోతున్నారు. అయితే, అసెంబ్లీ తీరుపై భారతీయ జనతా పార్టీ గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడుతున్నారు. అక్బరుద్దీన్ ఒవైసీ ప్రోటెం స్పీకర్ అయితే ఎమ్మెల్యేగా ప్రమాణం చేసేదీ లేదని తేల్చి చెప్పారు. పూర్తి స్థాయి స్పీకర్ బాధ్యతలు చేపట్టాక ఎమ్మెల్యేగా ప్రమాణం చేస్తామన్నారు రాజాసింగ్.
ఇదిలావుంటే, గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు భారతీయ జనతా పార్టీ కీలక పదవి ఇచ్చే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేఎల్పీ నేతగా రాజాసింగ్ నియమితులయ్యే అవకాశం కనిపిస్తోంది. బీసీ సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో ఆయనకు ఈసారి ఛాన్స్ వస్తుందని పార్టీ కేడర్ భావిస్తోంది. ఇక ఏలేటి మహేశ్వర్ రెడ్డిని బీజేఎల్పీ ఉపనేతగా నియమించే అవకాశముంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ ఈసారి 8 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించారు. అందులో ఆరు మంది కొత్తవారు కాగా, ఇద్దరే సీనియర్లు కావడంతో పార్టీ ఈ నిర్ణయం తీసుకునే అవకాశముంది.
మరోవైపు రేవంత్ రెడ్డి సర్కార్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కంటే ఎక్కువ ఉండకపోవచ్చన్నారు. ఆరు గ్యారంటీలను అమలు చేయడం సాధ్యం కాదన్న రాజాసింగ్, కేసీఆర్ తెచ్చిన అప్పులకు వడ్డీలే కట్టలేకపోతున్నారన్నారు. పథకాల అమలుకు డబ్బు ఎక్కడి నుంచి తెస్తారని ప్రశ్నించారు. బ్యాంకులు కొత్త అప్పులు ఇచ్చే పరిస్థితి లేదన్న ఆయన.. తెలంగాణను నడపాలంటే ఒక్క బీజేపీతోనే సాధ్యం అన్నారు రాజాసింగ్.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…