Telangana Formation Day: నిఖత్ జరీన్, ఇషా సింగ్‌కు రూ. 2 కోట్లు, మొగిలయ్యకు కోటి.. చెక్కులు ప్రదానం చేసిన కేసీఆర్
Telangana Formation Day: వివిధ రకాల క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించి బంగారు పతకాలు అందుకున్న తెలంగాణ క్రీడాకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్..
Telangana Formation Day: వివిధ రకాల క్రీడల్లో అంతర్జాతీయ స్థాయిలో రాణించి బంగారు పతకాలు అందుకున్న తెలంగాణ క్రీడాకారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ నగదు ప్రోత్సాహకాన్ని అందజేశారు. బాక్సింగ్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన నిఖత్ జరీన్, ఐఎస్ఎస్ఎఫ్ జూనియర్ ప్రపంచ కప్ షూటింగ్ పోటీసులు బంగారు పతకం సాధించిన ఇషా సింగ్‌లకు రూ. 2 కోట్లు చొప్పున నగదు పురస్కారం అందజేశారు. పబ్లిక్ గార్డెన్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో ఈ నగదుకు సంబంధించిన చెక్కులను క్రీడాకారులకు అందజేశారు ముఖ్యమంత్రి కేసీఆర్. నగదు పురస్కారంతో పాటు.. ఆ ఇద్దరు క్రీడాకారులకు జూబ్లీహిల్స్ ప్రాంతంలో చెరో 600 గజాల నివాస స్థలాలను ప్రభుత్వం కేటాయించింది. అందుకు సంబంధించిన ఆస్తి పత్రాలను నిఖత్ జరీన్, ఇషా సింగ్‌లకు అందజేశారు సీఎం కేసీఆర్. వీరితో పాటు.. కిన్నెరమెట్ల కళాకారుడు, పద్మశ్రీ అవార్డు గ్రహీత మొగిలయ్యకు గతంలో ప్రభుత్వం ప్రకటించిన కోటి రూపాయల నజరానాకు సంబంధించిన చెక్కును సీఎం కేసీఆర్ ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా మొగిలయ్యను సన్మానించిన సీఎం కేసీఆర్.. ఆయన కోరినట్లుగా బీఎన్‌రెడ్డి నగర్ కాలనీలో ఇంటి స్థలాన్ని కేటాయించి, అందుకు సంబంధించిన పత్రాలను అందజేశారు.