Governor Tamilisai Comments: తెలంగాణ రాష్ట్రానికి సేవ చేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాను.. బాధపడను.. అంటూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పేర్కొన్నారు. ఎన్ని ఇబ్బందులైనా ఎదుర్కొని తెలంగాణ ప్రజలకు సేవలను అందిస్తా అంటూ గవర్నర్ తమిళిసై స్పష్టంచేశారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గురువారం రాజ్ భవన్‌లో జరిగిన వేడుకల్లో గవర్నర్ తమిళిసై ఈ వ్యాఖ్యలు చేశారు. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడారు. అందరికీ నమస్కారం అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన గవర్నర్.. ఈ రాష్ట్రం నాది.. నేను ఈ రాష్ట్రానికి గవర్నర్‌ను మాత్రమే కాదు.. మీ సహోదరిని అంటూ వ్యాఖ్యానించారు. తెలంగాణకు సేవ చేయడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు అవకాశం కల్పించారన్నారు.
రాష్ట్రానికి సేవ చేస్తూ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటున్నాను. అయినా.. నేను బాధపడను.. ఎన్ని ఇబ్బందులున్నా ప్రజలకు నా సేవలను అందిస్తూనే ఉంటానని ప్రకటించారు. తాను రాష్ట్రానికి గవర్నర్‌ని కాదు.. మీ అందరి సహోదరిని.. ఎవరు ఆపినా మీ అందరినీ కలుస్తున్నాను.. కలుస్తూనే ఉంటాను అంటూ తమిళిసై స్పష్టంచేశారు. ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగానే తెలంగాణకు స్వేచ్ఛ లభించిందని.. రాష్ట్రం ఆవిర్భవించిందని తమిళిసై పేర్కొన్నారు.
ఇదిలాఉంటే.. ముందుగా గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ జన్మదినం సందర్భంగా రాజ్‌భవన్‌లో కేక్ సైతం కట్ చేశారు.
కాగా.. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం, గవర్నర్ మధ్య సఖ్యత లేని విషయం తెలిసిందే. తాజాగా గవర్నర్ చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..