Telangana Degree Exams: తెలంగాణలో పరీక్షల నిర్వహణపై రాష్ట్ర విద్యాశాఖ క్లారిటీ ఇచ్చింది. డిగ్రీ ఎగ్జామ్స్ యథావిధిగా కొనసాగుతాయని తెలిపింది. రాష్ట్రంలో ప్రారంభమైన డిగ్రీ పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని ఉన్నత విద్యా మండలి అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో డిగ్రీ రెండవ, మూడవ సంవత్సర పరీక్షలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే, ఈ పరీక్షలను వాయిదా వేసి ఆన్‌లైన్‌లో నిర్వహించాలని కొన్ని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ పరీక్షలను ఆఫ్ లైన్‌లోనే కొనసాగిస్తామని ఉన్నత విద్యా మండలి స్పష్టతనిచ్చింది.
మరోవైపు, మంగళవారం తెలంగాణ విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటిని ముట్టడించిన విద్యార్దుల పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. జేఎన్‌టీయూ, ఉస్మానియా యూనివర్సిటీల పరిథిలోని ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని కోరారు. కరోనా పూర్తిస్థాయిగా నియంత్రణ కాకపోవటంతో విద్యార్ధుల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్దులు డిమాండ్ చేశారు. లేదంటే ఆన్‌లైన్‌లో నిర్వహించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు నిరసన తెలిపారు. విద్యార్థులంతా వ్యాక్సిన్ వేయించుకోలేదనీ.. ఈ నేపథ్యంలో పరీక్షలు నిర్వహిస్తే విద్యార్దులకు మహమ్మారి బారిన పడే అవకాశముందని, పరీక్షలను కనీసం ఆన్‌లైన్‌లో నిర్వహించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. లేదంటే వ్యాక్సిన్లు వేసేవరకు పరీక్షలను వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. దీంతో రాష్ట్ర విద్యాశాఖ స్పష్టత ఇచ్చింది. పరీక్షలను వాయిదా వేసే ప్రసక్తే లేదని, యథావిధిగా ఆఫ్ లైన్‌లోనే పరీక్షలు జరుగుతాయని తేల్చి చెప్పింది.