Bjp vs Trs: ఆ 30 మంది సిద్ధంగా ఉన్నారు.. బాంబ్ పేల్చిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి..!
Bjp vs Trs: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారా? పార్టీలో చేరికపై ఒక క్లారిటీకి వచ్చారా? ఆయనతో పాటు మరికొంత..
Bjp vs Trs: మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరబోతున్నారా? పార్టీలో చేరికపై ఒక క్లారిటీకి వచ్చారా? ఆయనతో పాటు మరికొంత మంది నేతలను కూడా బీజేపీలోకి తీసుకెళ్తున్నారా? టీఆర్ఎస్‌ను బీజేపీ ఓడిస్తుందని నమ్మకంతో విశ్వేశ్వర్ రెడ్డి ఉన్నారా? అంటే.. పరోక్షంగా అవుననే సమాధానం ఇస్తున్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. గత రెండు రోజులుగా వరుసగా బీజేపీ నేతలను కలుస్తున్న విశ్వేశ్వర్ రెడ్డి.. రాజకీయంగా హల్ చల్ చేస్తున్నారు. మహాపాదయాత్రలో ఉన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ను కలవడం హాట్ టాపిక్ అయ్యింది. కొండా విశ్వేశ్వర్ రెడ్డి బీజేపీలో చేరుతారనే ప్రచారం విపరీతంగా జరుగుతోంది. ఈ నేపథ్యంలోనే స్పందించిన ఆయన.. మీడియాతో మాట్లాడారు. బీజేపీలో చేరడంపై దాదాపు క్లారిటీ ఇచ్చారు.
టీఆర్ఎస్‌కు వ్యతిరేకంగా బీజేపీ ఫైట్ చేస్తుందనే నమ్మకం ప్రజల్లో బలంగా ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. లీడర్లు, క్యాడర్ ఉన్న కాంగ్రెస్ పార్టీపై ప్రజల్లో ఏమాత్రం నమ్మకం లేదన్నారు. తాండూరు నియోజకవర్గంలో తాను నిర్వహించిన సర్వేల్లో కూడా ఇదే తేలిందని చెప్పుకొచ్చారు కొండా. కాంగ్రెస్ కన్నా బీజేపీ వ్యూహాలు ధీటుగా ఉన్నాయన్నారు. బీజేపీలో చేరడానికి కొన్ని అంశాలపై క్లారిటీ అడిగానని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. వచ్చే నెలలో తాను ఏ రాజకీయ పార్టీలో చేరాలనే దానిపై నిర్ణయం తీసుకుంటానని ప్రకటించారు. జాతీయ పార్టీలు కేసీఆర్ గెలిచినా తమకు ఉపయోగపడాలని అనుకుంటాయని పేర్కొన్నారు. అంతేకాదు.. మరో బాంబ్ కూడా పేల్చారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. టీఆర్ఎస్‌పై బీజేపీ రెండు అడుగులు ముందుకు వేస్తే 30 మంది కీలక నేతలు బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. వారెవరో త్వరలోనే తెలుస్తుందని చెప్పారు.
కాగా, టీఆర్ఎస్‌లో చేరి ఎంపీగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డి.. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో పార్టీని వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ పార్టీ నుంచి కూడా బయటకు వచ్చిన ఆయన కొంతకాలంగా స్థబ్దుగా ఉండిపోయారు. ఏ రాజకీయ పార్టీలో చేరనప్పటికీ.. రాజకీయంగా తన ప్రయాణాన్ని మాత్రం ఆపలేదు. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ.. మీడియాతో మాట్లాడుతూ వచ్చారు. హుజురాబాద్ ఎన్నికల్లో ఈటెల రాజేందర్‌కు బహిరంగంగానే మద్ధతు ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణలో మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన మళ్లీ యాక్టీవ్ అయ్యారు. తన పొలిటికల్ కెరియర్‌పై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరి కొండా.. ఏ పార్టీలో చేరుతారో అధికారికంగా క్లారిటీ రావాలంటే మరికొంతకాలం ఎదురు చూడాల్సిందే.