Gone Prakash vs Govt. Employees: ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన గోనె ప్రకాశరావుపై IAS అసోసియేషన్ తీవ్రంగా మండిపడింది. ఆయన వ్యాఖ్యలు కలెక్టర్ వ్యవస్థ విలువను తగ్గించడమే కాకుండా మహిళా అధికారి గౌరవాన్ని కించపరిచేలా ఉందని విరుచుకుపడింది. ఐఏఎస్ , ఐపిఎస్ అధికారులను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశరావు వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ప్రభుత్వ పథకాలను అమలు చేయడంలో ఉద్యోగులు నిబద్ధతతో పని చేస్తున్నారని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ నేతలు అన్నారు. ప్రకాశరావు ప్రధానంగా ఓ మహిళా కలెక్టర్‌పై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం సరికాదని వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యోగుల జేఏసీ తరుపున ఇలాంటి వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు.
మారుమూల జిల్లాలో పనిచేస్తున్న ఓ సిన్సియర్ ఆఫీసర్‌పై రాజకీయ నాయకులు ఇలాంటి ప్రకటన చేయడం ఆమెను మాత్రమే కాకుండా రాష్ట్రంలో పనిచేస్తున్న అధికారులందరినీ నిరుత్సాహానికి గురిచేస్తుందని అసోసియేషన్ అభిప్రాయపడింది. మహిళా అధికారికి వ్యతిరేకంగా ఈ అత్యంత అభ్యంతరకరమైన వ్యాఖ్యలకు చట్టం ప్రకారం అవసరమైన చర్యను ప్రారంభించాలని అసోసియేషన్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌ని అభ్యర్థించింది.
ప్రభుత్వ యంత్రాంగంపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఉద్యోగులు, అధికారుల మనోస్థైర్యం దెబ్బతింటుందని, దీనిపై కలెక్టర్‌ను వివరణ అడిగితే సమాధానం వచ్చేదని అన్నారు. ప్రభుత్వంలో సంక్షేమ పథకాలను అర్హులకు చేర్చే బాధ్యత అధికారులు, ఉద్యోగులదేనని, రాజకీయ నేతలు, యంత్రాంగం సమన్వయంతో ఉంటేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ నిబంధనల ప్రకారమే వ్యవహరిస్తారని, ఒక పార్టీ నేతలు మరో పార్టీ నేతలపై వ్యాఖ్యలు చేయడం సాధారణమే కానీ ఒక కలెక్టర్‌పై.. అది కూడా మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సీనియర్ నేత గోనె ప్రకాశరావుకు తగదని వారు హితవుపలికారు.
ఆదిలాబాద్, రంగారెడ్డి కలెక్టర్లపై అదే విధంగా ఐపీఎస్ అధికారులపై ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకొని, బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మామిళ్ల రాజేందర్, సెక్రెటరీ జనరల్ మమత, ఇతర నేతలు డిమాండ్ చేశారు. లేదంటే చట్టపరమైన చర్యలకు దిగుతామని హెచ్చరించారు.
ఇదిలావుంటే, ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్‌పై గోనే ప్రకాశ్ రావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఆమె తన బయోడేటా గురించి ఆరా తీశారని, ఓ జర్నలిస్ట్‌ను అడిగి తన గురించి తెలుసుకున్నారని చెబుతూ.. ఆమె చీర తడపకపోతే తన పేరు గోనె ప్రకాష్ రావే కాదంటూ సవాల్ విసిరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ విత్ డ్రా చివరి రోజున 10 మంది ఎమ్మెల్యేలతో పాటు 22 మంది టీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు కలెక్టర్ ఛాంబర్‌లో ఏం చేశారని ఆయన ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనలు ఉన్న నేపథ్యంలోనే అభ్యర్థులు కాకుండా… ఇతర నేతలు ఆమె చాంబర్‌లో సుమారు మూడు గంటల పాటు ఎందుకు ఉంటారని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆ రోజు సీసీ ఫుటేజీ తీసుకుంటామని చెప్పారు. ఎన్నికలకు సంబంధించి ఆదిలాబాద్‌తో పాటు రంగారెడ్డి జిల్లా కలెక్టర్ లు పాటించలేదని ఆయన ఆరోపించారు. దీనిపై కేంద్ర హోంమంత్రి అమిషాను కలుస్తానని చెప్పారు. ఈ క్రమంలోనే తన గురించి ఎంక్వయిరీ చేసిన కలెక్టర్ కు వార్నింగ్ ఇస్తున్నానంటూ ఆమె చీర తడుపుతా’ అంటూ గోనె ప్రకాశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
క్షమాపణలు చెప్పిన గోనె ప్రకాష్ రావు
ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్‌కు క్షమాపణ చెప్పారు గోనె ప్రకాష్ రావు. ఎవరిని ఉద్దేశపూర్వకంగా అవమానించలేదన్నారు. ఎవరి మనోభావాలను గాయపరచే ఉద్దేశం నాకు లేదు. కావాలని చేసింది కూడా కాదు. జరిగిన దానికి మనస్ఫూర్తిగా క్షమాపణ చెబుతున్నాను’ అంటూ గోనే ప్రకాష్ రావు అన్నారు. తాను క్షమాపణ చెబుతున్న వీడియోను కూడా దీనికి జత చేశారు. ఒక రాజకీయ నాయకుడిగా, ఆర్టీసీ ఛైర్మన్‌గా మచ్చలేని నేతగా ఎదిగానన్నారు. ఎన్నికల అధికారిగా విధులు సక్రమంగా నిర్వహించడంలేదని మాత్రమే వ్యాఖ్యానించారన్నారు. తన మాటలకు నొచ్చుకుని ఉంటే క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు.
Read Also… Cyril Ramaphosa: దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసాకు కరోనా పాజిటివ్.. అధికారుల్లో ఆందోళన!