
Karimnagar Politics: ఒకరు హిందుత్వమే తన నినాదమని ప్రచారం చేస్తున్నారు. మరొకరు సెక్యులర్ విధానమే తమ నినాదం అంటున్నారు. ఇలా రెండు విభిన్న ధృవాల మధ్య జరుగుతున్న పోరు కరీంనగర్‌లో ఆసక్తికరంగా మారుతోంది. కరీంనగర్ సిటీలో మరోసారి కమలం గుర్తుపై బండి సంజయ్, కారు గుర్తుపై మంత్రి గంగుల కమలాకర్ ప్రత్యర్థులుగా బరిలోకి దిగారు. దీంతో బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్థుల మధ్య మాటల తూటాలు భీకరంగా పేలుతున్నాయి. ఓట్ల పోలరైజేషన్ కోసం ఇరు పక్షాలు హోరా హోరీ తలపడుతున్నాయి. హిందూ ఓట్లు తనను దాటి పోకుండా చూసుకునేందుకు బండి సంజయ్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. సంప్రదాయంగా గులాబీ పార్టీకి పడుతున్న ఓట్లతో పాటు.. మైనారిటీ ఓట్లన్నీ గంపగుత్తగా తనకే పడేలా మంత్రి గంగుల కమలాకర్ తనవంతు ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో కరీంనగర్ రాజకీయం తార స్థాయికి చేరింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా.. మంత్రి గంగుల కమలాకర్‌ను టార్గెట్ చేశారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్. ముస్లింల ఓట్ల కోసం టోపీ పెట్టి మసీదులకు పోయి నమాజ్ చేసి ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒవైసీకి బొట్టు పెట్టించి హనుమాన్ చాలీసా చదివించే దమ్ముందా..? అని ప్రశ్నించారు బండి సంజయ్.
అటు బండి సంజయ్ ఆరోపణలపై కౌంటర్ ఇచ్చారు మంత్రి గంగుల కమలాకర్. అవినీతి, అక్రమాలకు పాల్పడిన కారణంగానే BJP అధ్యక్ష పదవి నుంచి ఆయన్ను తప్పించారన్నారు. MLA టికెట్ ఇప్పిస్తానని బండి సంజయ్ డబ్బులు తీసుకున్నారని, ఇందుకు సబంధించిన ఆధారాలు తమ దగ్గర ఉన్నాయన్నారు. మతం పేరుతో ఎంత రెచ్చగొట్టినా BJPకి ఓట్లు పడవన్నారు.
హిందుత్వ ఓట్ బ్యాంక్ కోసం బండి సంజయ్, సెక్యులర్ నినాదంతో జనంలోకి వెళ్తున్న మంత్రి గంగుల ఎలాంటి ప్రభావం చూపుతారో చూడాలి. మొత్తానికి పోలింగ్ తేదీ దగ్గరపడేకొద్దీ ఇద్దరు నేతల ప్రచారయుద్ధం ఇంకెంత హాట్ హాట్‌గా సాగుతుందోనన్న ఆసక్తికర చర్చ కరీంనగర్‌లో జరుగుతోంది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..