తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. కేవలం కేసీఆర్ ఒక్కడి వల్లే తెలంగాణ ఏర్పడలేదని తెలిపారు. తెలంగాణలో ఏర్పడేదీ బీజేపీ సర్కారేనని స్పష్టం చేశారు. ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో ప్రచారంలో బీజేపీ దూకుడు కనబరుస్తోంది. ఇప్పటికే ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సహా పలువురు ముఖ్యనేతలు ప్రచారంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. తాజాగా తెలంగాణలో రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రచారం నిర్వహించారు. మల్కాజిగిరి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బీజేపీ అభ్యర్థుల తరఫున రోడ్ షో నిర్వహించారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది.. అధికారమే లక్ష్యంగా ప్రధాన పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి.
ఐదు రాష్ట్రల్లో బీజేపీదే అధికారం
రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం చివరి రోజున, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రోడ్ షో నిర్వహించారు. అనంతరం తెలంగాణలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఐదు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రానున్నట్లు స్పష్టం చేశారు. స్వాతంత్య్ర అనంతరం అవినీతి ఆరోపణలు లేని కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు లేదని కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆ పార్టీ మంత్రులు కూడా అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు.
రాజస్థాన్‌లో మహిళ ఎమ్మెల్యేకే భద్రత లేదుః రాజ్‌నాథ్
రాజస్థాన్‌లో మహిళలను రక్షించడంలో సీఎం అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆయన మండిపడ్డారు. ఇలాంటి ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే హక్కు లేదని అన్నారు. రాజస్థాన్‌లో పరిస్థితి చాలా దారుణంగా ఉందని, ఒక మహిళా ఎమ్మెల్యే కూడా తనకు భద్రత లేదని భావించారని అన్నారు. రాష్ట్రంలో జరిగిన పలు హత్యలు, పేపర్ లీకేజీల ఘటనలను కూడా ప్రస్తావించిన ఆయన, ఎలాంటి కారణం లేకుండా టైలర్ కన్హయ్య లాల్‌ను హత్య చేసేంత స్థాయిలో శాంతిభద్రతలు క్షీణించాయని ధ్వజమెత్తారు.
ఎన్నికల తర్వాతే ముఖ్యమంత్రి ఖారారు
బీజేపీకి ఏ రాష్ట్రంలోనూ నాయకత్వ సంక్షోభం లేదన్న ఆయన.. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించడం లేదన్నారు. ప్రతి రాష్ట్రంలో పార్టీ, ప్రభుత్వానికి ఖచ్చితమైన ప్రణాళిక ఉంది. ఎన్నికలు పూర్తయిన తర్వాత సీఎం పేరును ఖరారు చేస్తామన్నారు. ఎన్నికల తర్వాత నాయకుడిని ఎన్నుకోవడంలో బీజేపీకి ఎలాంటి సమస్య ఉండదన్నారు. అందరి అభిప్రాయాల మేరకే ముఖ్యమంత్రిని ఎంపిక చేస్తామన్నారు. అయితే తెలంగాణలో మాత్రం ముందస్తుగా బీసీ అభ్యర్థిని ముఖ్యమంత్రిగా ప్రకటించి, ఎన్నికలకు వెళ్తున్నామని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు.
తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర
రాజస్థాన్‌లో అధికారంలోకి రావడం ఖాయమన్న రాజ్‌నాథ్ సింగ్, మూడింట రెండు వంతుల మెజారిటీని సాధిస్తామన్నారు. వసుంధర రాజే బలమైన నాయకురాలన్న ఆయన, రాజస్థాన్‌లో గెలుపు కోసం పూర్తి అంకితభావంతో ఎన్నికలలో నిమగ్నమై ఉన్నారన్నారు. అటు మధ్యప్రదేశ్‌లోనూ మరోసారి ప్రభుత్వం ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. చత్తీస్‌గఢ్ రాష్ట్రంలో కూడా మేమే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామనే నమ్మకంతో ఉన్నామన్నారు. తెలంగాణ ఏర్పాటులో బీజేపీ కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే లక్ష్యంగా ఎన్నికల్లో పోటీ చేస్తున్నామన్నారు.
రాహుల్‌కు ప్రజలే బుద్ధి చెబుతారుః రాజ్‌నాథ్
ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా మండిపడ్డారు రాజ్‌నాథ్ సింగ్. విశ్వగురుగా పేరు తెచ్చుకున్న ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. రాహుల్ గాంధీ అహంకారంతో కూడిన మాటలు మాట్లడుతున్నారని, ప్రజలే తగిన బుద్ది చెబుతారన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే జనం అసహించుకుంటున్నారన్నారు.
రాజౌరి దాడిపై రక్షణ మంత్రి సీరియస్
రాజౌరి దాడిపై రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఘాటు స్పందించారు. పాకిస్థాన్ చేష్టలు మానుకోవాలని హితవు పలికారు. లేదంటే కశ్మీర్‌లోని ఆర్మీ ధీటుగా స్పందించాల్సి వస్తుందని హెచ్చరించారు. కాశ్మీర్‌లో ఇటీవల దాడులు పెరుగుతున్న నేపథ్యంలో హమాస్, లష్కరే ఐక్యమయ్యే అవకాశాలను కొట్టిపారేయలేమన్నారు. పీఓకేపై దాడి చేయాల్సిన అవసరం లేదని, పీవోకే తనంతట తానుగా భారత్‌లో చేరే దిశగా అడుగులు వేస్తోందని స్పష్టం చేశారు. ఇజ్రాయెల్‌తో ఉగ్రవాదంపై పోరులో భారత్ పూర్తిగా నిలుస్తుందన్న రాజ్‌నాథ్ సింగ్.. కానీ అమాయకుల ప్రాణాలు మాత్రం పోకూడదన్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…