Dornakal: ఇప్పటి వరకు నలుగురే ఎమ్మెల్యేలు.. అంతా హ్యాట్రిక్ వీరులే.. మరోసారి చరిత్ర తిరగరాస్తారా!

ఆ నియోజకవర్గ ప్రజల తీర్పు విచిత్రం. అక్కడి నేతల చరిత్ర ఆశ్చర్యం. ఏడు దశాబ్దాల చరిత్రలో నలుగురే ఎమ్మెల్యేలు. ప్రతి ఒక్కరూ హ్యాట్రిక్ వీరులే. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎడోవసారి గెలుపు కోసం సమరానికి సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ డిఫరెంట్ నియోజకవర్గం ఏది..? అక్కడి ప్రజల ఆశీస్సులతో రికార్డులు సృష్టించిన ఆ నలుగురు ఎవరు..?

Dornakal: ఇప్పటి వరకు నలుగురే ఎమ్మెల్యేలు.. అంతా హ్యాట్రిక్ వీరులే.. మరోసారి చరిత్ర తిరగరాస్తారా!
Redya Naik, Satyavathi Rathod

Edited By:

Updated on: Oct 28, 2023 | 7:57 AM

ఆ నియోజకవర్గ ప్రజల తీర్పు విచిత్రం. అక్కడి నేతల చరిత్ర ఆశ్చర్యం. ఏడు దశాబ్దాల చరిత్రలో నలుగురే ఎమ్మెల్యేలు. ప్రతి ఒక్కరూ హ్యాట్రిక్ వీరులే. ఇప్పటికే డబుల్ హ్యాట్రిక్ సాధించిన సిట్టింగ్ ఎమ్మెల్యే ఇప్పుడు ఎడోవసారి గెలుపు కోసం సమరానికి సిద్ధమయ్యారు. ఇంతకీ ఆ డిఫరెంట్ నియోజకవర్గం ఏది..? అక్కడి ప్రజల ఆశీస్సులతో రికార్డులు సృష్టించిన ఆ నలుగురు ఎవరు..? ప్రత్యేక కథనం మీకోసం..

సాధారణంగా ఒకటి రెండు సార్లు గెలిచిన వారు మూడోసారి గెలవాలంటే ఆపసోపాలు పడుతుoటారు. పేరుమోసిన దిగ్గజాలు కూడా హ్యాట్రిక్ విక్టరీలు సాధించడం అంత ఈజీ ఏం కాదు. పూర్వపు వరంగల్ జిల్లా పరిధిలోని డోర్నకల్ నియోజకవర్గ రాజకీయ ముఖచిత్రం విచిత్రం. ఏడు దశబ్దాల చరిత్రలో ఈ నియోజక వర్గం నుండి నలుగురు మాత్రమే అసెంబ్లీలో అడుగుపెట్టారు. డోర్నకల్ నియోజకవర్గానికి 1957 లో మొట్ట మొదటసారి ఎన్నికలు జరిగాయి. అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి నూకల రాంచంద్రరెడ్డి 1957 నుండి 1972 వరకు నాలుగు పర్యాయాలు వరుసగా విజయాలు సాధించారు. 1972 లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

నూకల రాంచంద్రారెడ్డి మరణం నేపథ్యంలో 1974లో ఉప ఎన్నికలు వచ్చాయి.. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి చెందిన రామసహాయం సురేందర్ రెడ్డి మరోసారి ఏకగ్రవంగా ఎన్నికయ్యారు. ఈయన కూడా 1974 నుండి 1985 వరకు వరుసగా నాలుగు పర్యాయాలు గెలుపొందారు. 1989 లో ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రెడ్యానాయక్ తొలిసారి ఎమ్మెల్యే గా గెలుపొందారు. 1989 నుండి 2004 వరుసగా నాలుగు పర్యాయాలు గెలిచిన రెడ్యా నాయక్, 2009 లో సత్యవతి రాథోడ్ చేతిలో ఓటమి పాలయ్యారు. నాలుగు సార్లు గెలిచిన ఐదోవసారి ఓటమిపాలైనా రెడ్యానాయక్‌లో కసి తీరలేదు. 2014 ఎన్నికల్లో తిరిగి మళ్ళీ గెలుపొందారు. 2018 ఎన్నికల్లో మరోసారి గెలుపొంది డబుల్ హ్యాట్రిక్ విక్టరీ తన ఖాతాలో వేసుకున్నారు..

ఈ నియోజక వర్గ రాజీయ చరిత్ర తెలంగాణ రాష్ట్ర రాజకీయ ముఖ చిత్రంలోనే ప్రత్యేక చర్చగా నిలిచింది. ఏడు దశబ్దాల చరిత్రలో కేవలం నలుగురు అంటే నలుగురు మాత్రమే ఎమ్మెల్యేలు కావడం ఆసక్తికర చర్చగా మారింది. ఒకప్పటి కాంగ్రెస్ కంచుకోట ఇది.. వరుస విజయాలతో దూసుకుపోతున్న రెడ్యానాయక్ ఓడించిన చరిత్ర సత్యవతి రాథోడ్‌ది. ఇప్పుడు ఆ ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. మరి కాంగ్రెస్ పార్టీ పూర్వ వైభవాన్ని సాధిస్తుంది. డోర్నకల్ కోట పై మళ్ళీ కాంగ్రెస్ జెండా ఎగురవేస్తుందా అనే చర్చ జనంలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పటివరకు ఇక్కడ పోటీ చేసిన ప్రతి ఒక్కరికీ ఒక్కో రికార్డ్ కట్టబెట్టిన డోర్నకల్ ప్రజలు, ఈసారి ఎవరిని ఆశీర్వదించి అసెంబ్లీకి పంపుతారో వేచి చూడాలి..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…