AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Telangana Election: ఇటు అరవింద్.. అటు జీవన్ రెడ్డినే టార్గెట్.. పక్కా వ్యూహంతో ఎమ్మెల్సీ కవిత..!

కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసెంబ్లీ ఎన్నికల్లో తన పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. లోకసభ ఎన్నికల్లో తన ప్రత్యర్థిపై పైచేయి సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్ష నేతల ఓటమి టార్గెట్‌గా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు కవిత. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ చేశారు. ఖచ్చితంగా ఈ ఇద్దరని ఓడిస్తానని శపథం చేస్తున్నారు కవిత..!

Telangana Election: ఇటు అరవింద్.. అటు జీవన్ రెడ్డినే టార్గెట్.. పక్కా వ్యూహంతో ఎమ్మెల్సీ కవిత..!
Kavitha On Aravind, Jeevan Reddy
G Sampath Kumar
| Edited By: |

Updated on: Nov 19, 2023 | 1:27 PM

Share

ముఖ్యమంత్రి కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అసెంబ్లీ ఎన్నికల్లో తన పట్టు బిగించే ప్రయత్నం చేస్తున్నారు. లోకసభ ఎన్నికల్లో తన ప్రత్యర్థిపై పైచేయి సాధించే దిశగా ముందుకు సాగుతున్నారు. ప్రతిపక్ష నేతల ఓటమి టార్గెట్‌గా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు కవిత. అసెంబ్లీ ఎన్నికల్లో రెండు నియోజకవర్గాలపై స్పెషల్ ఫోకస్ చేశారు. ఖచ్చితంగా ఈ ఇద్దరని ఓడిస్తానని శపథం చేస్తున్నారట కవిత..!

వచ్చే ఏడాది జరగనున్న లోకసభ ఎన్నికలను దృష్టిలో పెట్టుకున్న ఎమ్మెల్సీ కవిత నిజామాబాద్ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో తన పట్టు బిగించే ప్రయత్నాల్లో మునిగిపోయినట్టుగా స్పష్టం అవుతోంది. ఈ ఎన్నికల్లో కవిత నిజామాబాద్ అర్బన్, బోధన్ నియోజకవర్గాల్లోని బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఈ రెండు చోట్ల కూడా కవిత ఇంఛార్జిగా బాధ్యతలు నిర్వహిస్తారు. అయితే ఆమె మాత్రం లోకసభ పరిధిలోని దాదాపు అన్ని సెగ్మెంట్లలోనూ కలియ తిరుగతూ పార్టీ అభ్యర్థుల గెలుపులో భాగస్వాములు అవుతున్నారు.

టార్గెట్ అదేనా..?

అయితే కవిత ఎత్తుల వెనక భారీ వ్యూహం దాగి ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. నిజామాబాద్ సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ గత ఎన్నికల్లో కవితను ఓడించిన సంగతి తెలిసిందే. అరవింద్ ప్రస్తుతం జగిత్యాల జిల్లా కోరుట్ల నుండి బరిలో నిలుస్తున్న నేపథ్యంలో ఆయన ఓటమి కోసం పక్కాగా స్కెచ్ వేస్తున్నారు కవిత. ఎమ్మెల్యేగా అరవింద్ ఓటమి చెందినట్టయితే తన ప్రత్యర్థిని రాజకీయంగా మట్టుబెట్టినట్టు అవుతుందని అంచనా వేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు తన ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా ఉన్న బీఆర్ఎస్ అభ్యర్థి డాక్టర్ కల్వకుంట్ల సంజయ్‌కు బాసట ఇచ్చినట్టవుతుందని అనుకుంటున్నారట.

తన తండ్రి సీఎం కేసీఆర్ సీరియస్‌గా ఉన్నప్పుడు వెంటనే చికిత్స అందించడంతో పాటు అన్న కేటీఆర్‌కు కూడా అత్యంత సన్నిహితుడు కావడంతో ఇక్కడ ప్రత్యేక దృష్టి సారించినట్టుగా భావిస్తున్నారు. అయితే కోరుట్లలో బీఆర్ఎస్ పార్టీ పైచేయిగా నిలిచినట్టయితే తన వ్యూహం ఫలించినట్టు అవుతుందని కూడా అంచనా వేస్తున్నట్టుగా తెలుస్తోంది.

సీనియర్ నేతపై పట్టు కోసం…

మరో వైపున జగిత్యాల నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టి. జీవన్ రెడ్డిని మరోసారి ఓడించాలన్న లక్ష్యంతో కవిత ఇక్కడ కూడా ప్రచారం చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌ను బరిలో నిలిపడంలో కీలక పాత్ర పోషించిన కవిత, మరోసారి ఆయన గెలుపునకు పట్టుబడుతున్నారు. దీనివల్ల గత లోకసభ ఎన్నికల్లో తన ఓటమికి కారకుల్లో ఒకరైన జీవన్ రెడ్డిపై మరోసారి ప్రతీకారం తీర్చుకున్నట్టు అవుతుందని భావిస్తున్నారట.

రెండు చోట్లా…

జగిత్యాల కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డి, కోరుట్ల బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఇద్దరు కూడా తన ప్రత్యర్ధులు కావడంతో వారిని ప్రజాక్షేత్రంలో ఓడించినట్టయితే అన్నింటా తనదే పై చేయి అవుందన్న ఆలోచనతోనే కవిత పావులు కదుపుతున్నారన్న చర్చ సాగుతోంది.

భవిష్యత్తు వ్యూహం…

మరో వైపు కవిత లోకసభ ఎన్నికల్లో నిజామాబాద్ నుండి గెలవాలన్న సంకల్పంతోనే అసెంబ్లీ ఎన్నికలను ఆసరాగా చేసుకునే అవకాశాలు కూడా లేకపోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. వచ్చే సంవంత్సరం జరగనున్న లోకసభ ఎన్నికల్లో అరవింద్‌ను ఓడించాలంటే గ్రౌండ్ లెవల్ కేడర్‌ను బలంగా తయారు చేసుకునే పనిలో పడ్డారు కవిత. ఇందుకు అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని కవిత అనుకూలంగా మల్చుకునే అవకాశాలు లేకపోలేదన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ లోకసభ పరిధిలోని ఏడు సెగ్మెంట్లలో కవిత వ్యూహాలు ఎంతమేర పనిచేస్తాయి..? ఎన్ని చోట్ల గులాబీ జెండా రెపరెపలాడుతోంది అన్న విషయం తేలాలంటే మాత్రం మరో పది రోజులు ఆగాల్సిందే..!

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…