
MLA Balka Suman Vs Vivek Venkataswamy: మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గం. ఈ ఎన్నికల్లో సిట్టింగ్ MLA బాల్కసుమన్, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉండబోతున్న జి. వివేక్ వెంకట్‌స్వామి మధ్య టఫ్ ఫైట్ తప్పదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, వేలకోట్ల రూపాయలతో నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేశానని, ప్రభుత్వ సంక్షేమ పథకాలే తనను మళ్లీ గెలిపిస్తాయని బాల్కా సుమన్ ధీమా వ్యక్తం చేశారు. ఇక మొన్ననే బీజేపీ నుంచి సడెన్‌గా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న జి.వివేక్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బాల్కసుమన్. చెన్నూరులో వేల కోట్లు ఉన్న వివేక్‌కు.. వేల కోట్ల అభివృద్ధికి మధ్య పోటీ జరుగుతోందన్నారు. బీఆర్‌ఎస్ నేతలను కొనేందుకు వేలం పాట పెట్టారన్న ఆయన.. చెన్నూరులో వివేక్.. బెల్లంపల్లిలో వినోద్ కోట్లు ఖర్చు చేస్తున్నారు. ప్రజల ఆశీర్వాదంతో చెన్నూరులో మళ్లీ తనదే గెలుపు ఖాయమని బాల్క సుమన్ తెలిపారు. కాంగ్రెస్ కొనుగోళ్ల రాజకీయానికి తెరలేపిందంటూ బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు కోట్ల రూపాయల ఆఫర్లు ఇస్తున్నారని మండిపడ్డారు. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో ఆధారాలు ఉన్నాయని..ఈ ఆధారాలన్నీ చూపించి ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు.
ఇక చెన్నూరు నియోజకవర్గంలో పర్యటించిన జి.వివేక్..బాల్కసుమన్ వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు. ఇసుక, భూ దందాతో సుమన్ వేలకోట్లు సంపాదించారని విమర్శించారు. ప్రశ్నించిన ప్రజలపై కేసులు పెట్టారని మండిపడ్డారు. ఈ ఎన్నికల్లో ప్రజలే సుమన్‌కు గుణపాఠం చెబుతారని వివేక్ పేర్కొన్నారు. కొనుగోళ్ల రాజకీయం కాంగ్రెస్‌కు అవసరం లేదంటూ వివేక్ కౌంటర్ ఇచ్చారు. చెన్నూరులో తాను బరిలోకి దిగుతున్నాననే భయంతోనే..బాల్క సుమన్ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారంటూ వివేక్ పేర్కొన్నారు.
చెన్నూరు నియోజకవర్గంలో పలువురు బీఆర్ఎస్ కార్యకర్తలు నిన్న కాంగ్రెస్‌లో పార్టీలో చేరారు. ఎంపీపీ, సర్పంచ్‌లను జి.వివేక్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. వేలకోట్లు ఉన్న జి.వివేక్..బీఆర్‌ఎస్ కార్యకర్తలను డబ్బుతో కొంటున్నారని విమర్శించారు బాల్కసుమన్. కాంగ్రెస్‌వి కొనుగోళ్లు రాజకీయాలని విమర్శిస్తే, తమవి ప్రజా రాజకీయాలని వివేక్ కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి జి.వివేక్ ఎంట్రీతో చెన్నూరు రాజకీయాల్లో బీఆర్‌ఎస్ వర్సెస్ కాంగ్రెస్‌గా మారిపోయింది.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..