Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై సర్కార్ కీలక నిర్ణయం..!

తెలంగాణలో ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ అంశం మరోసారి తెరపైకి వచ్చింది. ప్రతి రెండేళ్లకు ఎనిమిది శాతం వరకు ఫీజులు పెంచుకునేందుకు అనుమతినిస్తూ విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. అయితే ఈ ప్రతిపాదనపై అటు పాఠశాల యాజమాన్యాలు, ఇటు విద్యార్థి తల్లిదండ్రుల సంఘాలు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. ఫీజుల పెంపు చుట్టూ జరుగుతున్న అసలు రచ్చ ఏంటో ఈ కథనంలో తెలుసుకుందాం..

Telangana: తల్లిదండ్రులకు బిగ్ అలర్ట్.. ప్రైవేట్ స్కూల్ ఫీజుల నియంత్రణపై సర్కార్ కీలక నిర్ణయం..!
Telangana School Fee Regulation

Updated on: Jan 19, 2026 | 7:40 AM

తెలంగాణలోని ప్రైవేట్ పాఠశాలల ఫీజుల నియంత్రణ అంశం మరోసారి చర్చనీయాంశమైంది. ప్రైవేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక ప్రతిపాదనను సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపింది. విద్యాశాఖ ప్రతిపాదన ప్రకారం.. ప్రైవేట్ స్కూళ్లు ప్రతి రెండేళ్లకు ఒకసారి 8 శాతం వరకు మాత్రమే ఫీజులు పెంచుకోవడానికి అనుమతించాలని కోరారు. అంతకంటే ఎక్కువ పెంచాలనుకుంటే మాత్రం రాష్ట్ర ఫీజు నియంత్రణ కమిటీ లేదా జిల్లా కమిటీల నుంచి ముందస్తు అనుమతి తప్పనిసరి. పాఠశాలలు సమర్పించే పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుందని విద్యాశాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫైల్ ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉంది.

ప్రభుత్వ ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్న యాజమాన్యాలు

ప్రస్తుతం హైదరాబాద్‌లోని పాఠశాలలు 10-15 శాతం ఫీజులను పెంచుతున్నాయి. విద్యాశాఖ ప్రతిపాదించిన 8 శాతం పరిమితిని పాఠశాల యాజమాన్యాలు తోసిపుచ్చుతున్నాయి. తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాల నిర్వహణ సంఘం అధ్యక్షుడు సాదుల మధుసూధన్ మాట్లాడుతూ.. రాజస్థాన్, గుజరాత్, పంజాబ్ వంటి రాష్ట్రాల్లో లాగా వినియోగదారుల ధరల సూచిక ఆధారంగా ఏటా ఫీజులను సవరించాలని డిమాండ్ చేశారు. టీచర్లు, సిబ్బందికి ఏటా జీతాలు పెంచాల్సి ఉంటుంది కాబట్టి ప్రభుత్వం ఎలాంటి ముందస్తు అనుమతి లేకుండానే కనీసం 5 శాతం వార్షిక పెంపునకు అవకాశం ఇవ్వాలని వారు కోరుతున్నారు. ఇప్పటికే ఈ అంశంపై కే. కేశవరావు నేతృత్వంలోని కమిటీకి వినతిపత్రం సమర్పించారు.

తల్లిదండ్రుల ఆందోళన.. కమిషన్ వైఫల్యంపై విమర్శలు

మరోవైపు హైదరాబాద్ స్కూల్స్ పేరెంట్స్ అసోసియేషన్ ప్రతినిధులు ప్రభుత్వ వైఖరిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. “స్కూళ్లు ఇప్పటికే ఇష్టారాజ్యంగా ఫీజులు పెంచేశాయి. అసలు బేస్ ఫీజు ఎంత ఉండాలనే దానిపై చర్చ జరగడం లేదు” అని HSPA అధ్యక్షుడు వెంకట్ సాయినాథ్ విమర్శించారు. విద్యా కమిషన్ నిర్లక్ష్యం వల్లే తల్లిదండ్రులు నష్టపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొన్ని పాఠశాలలు ఏటా 50 నుండి 80 శాతం వరకు ఫీజులు పెంచుతున్నాయని HSPA సభ్యుడు కిషోర్ BVK ఆరోపించారు. ప్రభుత్వం ఈ నిబంధనలను కఠినంగా అమలు చేయాలని, ఫిర్యాదుల కోసం ప్రత్యేక హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.

విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంటున్నా, ఫీజుల నియంత్రణపై స్పష్టత రాకపోవడం తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తోంది. ప్రభుత్వం విద్యాశాఖ ప్రతిపాదనలను ఆమోదిస్తుందా లేదా యాజమాన్యాల డిమాండ్లకు తలొగ్గుతుందా అన్నది వేచి చూడాలి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..