Telangana: తెలంగాణ సర్కార్ వారి డీట్ యాప్ – మీ అర్హతకు తగిన ఉద్యోగం మీ చెంతకు

ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాల కోసం తలచేస్తున్న యువత కోసం తెలంగాణ ప్రభుత్వం డీట్ యాప్‌ను రూపొందించింది. దీని ద్వారా నేరుగా కంపెనీలు ఉద్యోగ ఖాళీలను పోస్ట్ చేస్తుండటంతో, అర్హులైన అభ్యర్థులకు ఉద్యోగ అవకాశాలు మరింత చేరువవుతున్నాయి. ఇప్పటివరకు 84 వేల మందికి పైగా యువత డీట్‌లో నమోదు చేసుకున్నారు.

Telangana: తెలంగాణ సర్కార్ వారి డీట్ యాప్ - మీ అర్హతకు తగిన ఉద్యోగం మీ చెంతకు
DEET App

Edited By: Ram Naramaneni

Updated on: Jul 18, 2025 | 6:40 PM

ఉన్నత విద్య పూర్తి చేసిన తర్వాత ఎంతో మంది యువత ఉద్యోగాల కోసం తిరుగుతుంటారు. కానీ ఏ సంస్థల్లో ఖాళీలు ఉన్నాయో, ఎలా అప్లై చేయాలో తెలియక ఉద్యోగ అవకాశాలు చేజారిపోతున్నాయి. ఇలాంటి సమస్యలను పరిష్కరించడానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం డీట్‌ (డిజిటల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ) అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించింది.

ఈ యాప్ ద్వారా నిరుద్యోగులు తమ విద్యార్హతలకు అనుగుణంగా ఉద్యోగాలకు దరఖాస్తు చేయవచ్చు. ఉద్యోగాలిచ్చే సంస్థలు ఈ వేదికలో తమ ఖాళీలను పోస్ట్ చేయడంతో.. అర్హులైన అభ్యర్థుల సమాచారాన్ని పరిశీలించి వారి ఎంపికను తేలుస్తాయి.

గత ఏడాది డిసెంబర్‌లో ప్రారంభమైనా.. ఈ యాప్ గురించి సరైన ప్రచారం జరగకపోవడం వల్ల చాలామందికి ఇది తెలియదు. కానీ యాప్‌ గురించి తెలిసిన వారు ఇప్పుడిప్పుడే దరఖాస్తులు చేసుకోవడం ప్రారంభించారు. ఇప్పటివరకు తెలంగాణవ్యాప్తంగా 1,134 ప్రైవేటు కంపెనీలు డీట్‌ వేదికలో రిజిస్ట్రేషన్ చేసుకోగా.. 84,913 మంది నిరుద్యోగులు దరఖాస్తు చేశారు.

ఎవరైనా ఉపయోగించవచ్చు

డీట్ యాప్‌లో నమోదు చేసుకోవాలంటే పదో తరగతి పాస్ అయిందంటే సరిపోతుంది. ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, ఇంజినీరింగ్, పీజీ విద్యార్హతలు కలిగిన వారు లేదా ప్రొఫెషనల్ కోర్సులు పూర్తిచేసిన వారు మాత్రమే కాదు.. చదువు చివరి సంవత్సరంలో ఉన్నవారూ రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఇంటర్న్‌షిప్, పార్ట్‌టైమ్, ఫుల్‌టైమ్ ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉంటాయి.

ఎలా రిజిస్ట్రేషన్ చేయాలి?

1. వెబ్‌సైట్: https://deet.telangana.gov.in

2. మొబైల్ యాప్: Play Store లేదా App Store నుంచి “DEET Telangana” యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

అభ్యర్థులు తమ పేరు, పుట్టిన తేదీ, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడీ, జిల్లా వంటి వివరాలతో పాటు విద్యార్హతలు, నైపుణ్యాలు, అనుభవం, అభిరుచులు తదితర వివరాలను నమోదు చేయాలి. అవసరమైన ధ్రువపత్రాలను అప్‌లోడ్ చేయాలి.

మోసాలకు చోటులేదు

డీట్ యాప్‌ను తెలంగాణ పరిశ్రమల శాఖ నేరుగా పర్యవేక్షిస్తోంది. అందువల్ల నకిలీ కంపెనీలకు తావులేదు. ఎంపిక ప్రక్రియ పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. అవసరమైతే ముఖాముఖి ఇంటర్వ్యూలు కూడా నిర్వహిస్తారు. అదేవిధంగా అభ్యర్థులకు నైపుణ్య అభివృద్ధి, ఉపాధి అవకాశాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా అందుబాటులో ఉంటాయి.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి..