నర్సంపేట, జూన్ 20: రీల్స్ మోజు యువకుడి ప్రాణాలు తీసింది. సరదాగా మెడకు ఉరిని వేసుకుని ఫొటోకు ఫోజులివ్వబోయాడు. కానీ అనుకోకుండా అది మెడకు బిగించుకుని ప్రాణాలు పోగొట్టుకున్నాడు. రాత్రి సమయంలో కావడంతో ఎవరూ గమనించలేదు. దీంతో యువకుడు మృతి చెందాడు. తెల్లారి నిద్రలేచిన తల్లిదండ్రలు ఉరికొయ్యకు వేలాడుతూ కొడుకు కనిపించడంతో గుండెలవిసేలా రోధించారు. ఈ విషాద ఘటన వరంగల్ జిల్లా, నర్సంపేటకు మండలంలో మంగళవారం రాత్రి (జూన్ 18) చోటు చేసుకుంది. వివరాల్లోకెళ్తే..
వరంగల్ జిల్లా, నర్సంపేటకు మండలం నర్సంపేటకు చెందిన కందకట్ల అజయ్ (23) అనే యువకుడు స్థానికంగా ఓ హోటల్‌లో పని చేస్తుంటాడు. ఖాళీ సమయాల్లో అతడికి మొబైల్‌తో రీల్స్ చేసే అలవాటు ఉంది. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇంటికి వచ్చిన అజయ్.. మల్లంపల్లి రోడ్డులోని తన చిన్నక్క ఇంటికి వచ్చాడు. ఉరి వేసుకుంటూ సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించాలనే ఉద్దేశంతో ఫ్రిజ్‌పై సెల్‌ఫోన్‌ని అమర్చి దూలానికి ఉరి తాడు వేశాడు. అనంతరం ఉరి ఉచ్చును తలకు వేసుకుని వీడియో చిత్రీకరిస్తూ ఉన్న క్రమంలో.. అనుకోకుండా మెడకు ఉరి బిగుసుకుంది.
ఊపిరి ఆడకపోవడంతో కొద్ది సేపటికే అజయ్ మృతి చెందాడు. బుధవారం ఉదయం నిద్రలేచిన కుటుంబ సభ్యులు అజయ్ మృతదేహాన్ని చూసి కన్నీరు మున్నీరుగా విలపించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించడంతో.. వారు ఘటనా స్థలంలో సెల్‌ఫోన్‌ని స్వాధీనం చేసుకున్నారు. తన కుమారుడి మృతిపై అనుమానం ఉందంటూ అజయ్ తల్లి దేవమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి.