
ఈ మున్సిపాలిటీలకు ఏమైంది? అధికార పార్టీలో నేతల మధ్య పొసగడం లేదా? చైర్మన్ల తీరు కౌన్సిలర్లకు నచ్చడం లేదా? వరుస పెట్టున మున్సిపల్ అవిశ్వాస తీర్మానాలు. ఈ మున్సిపల్ అవిశ్వాసాలే ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. అసలేం జరుగుతోంది? రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడిదే అతి పెద్ద చర్చనీయాంశం. ఇవాళ గజ్వేల్.. నిన్న ఎల్లారెడ్డి.. అంతకన్నా ముందు వనపర్తి, ఆపై ఆర్మూర్, జనగామ, నందికొండ, యాదగిరిగుట్ట, చండూరు, జగిత్యాల, మేడ్చల్. మాకొద్దీ చైర్ మన్ అంటూ.. అవిశ్వాస తీర్మానాలు హోరెత్తుతున్నాయి. వీటితో పాటు.. భువనగిరి, ఇల్లందు, సంగారెడ్డి, సదాశివపేట, ఆందోల్. ఆయా కలెక్టరేట్లలో కౌన్సిలర్లు.. తీర్మానాల లేఖలను అందించారు. వీటిలో మంత్రుల ఇలాఖాలు సైతం ఉన్నాయి. మంత్రులెంత ప్రాధాయ పడుతున్నా.. ఆయా మున్సిపాల్టీల కౌన్సిలర్లు.. మాకొద్దీ చైర్ పర్సన్లని అంటున్నారు. ఒక్కో మున్సిపాల్టీ ఒక్కో కథ. ఎందుకిలా జరుగుతోంది? మరీ ముఖ్యంగా కొందరు మహిళా చైర్ పర్సన్లు.. కన్నీటి పర్యంతం అయిన దృశ్యాలు.
వనపర్తి వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్ రెడ్డి సొంత నియోజకవర్గం. మున్సిపల్ ఛైర్మన్ గట్టు యాదవ్, వైస్ చైర్మన్ వాకిటి శ్రీధర్‌కు వ్యతిరేకంగా అధికార, విపక్ష కౌన్సిలర్లు ఒక్కటయ్యారు. దీంతో ఈ వ్యవహారం ఆయనకు తలనొప్పిగా మారింది. మున్సిపల్ కౌన్సిలర్ల మధ్య సయోధ్య సాధించడం ఆయన బాధ్యతగా మారి తెగ ఇబ్బంది పెట్టింది.
ఇక పోతే మేడ్చల్. కార్మిక మంత్రి మల్లారెడ్డి సొంత నియోజకవర్గంలోని మున్సిపాల్టీల్లో అడుగడుగునా అసంతృప్త జ్వాలలు ఎగసి పడుతున్నాయ్. ఫిర్జాదీ గూడ, జవహార్ నగర్ లో మొదలైన అసంతృప్తులు.. నేడు మేడ్చల్ మున్సిపాల్టీలోనూ ముసలం రేపింది. మేడ్చల్ మున్సిపల్ చైర్ పర్సన్.. మర్రి దీపికా రెడ్డిపై అవిశ్వాసం పెట్టారు 15 మంది కౌన్సిలర్లు. కొన్నాళ్లుగా దీపికా రెడ్డిపై అవినీతి ఆరోపణలు చేస్తున్నారు వీరంతా.
మంత్రుల సంగతిలా ఉంటే.. ఎమ్మెల్యేల పరిస్థితి మరోలా ఉంది. ఆర్మూర్ చైర్ పర్సన్ వద్దే వద్దంటూ 26 మంది కౌన్సిలర్లు నిరసన గళం విప్పారు. చైర్ పర్సన్‌ను తొలగించాలంటూ మూకుమ్మడిగా నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేను కలిసి తమ మనస్సులో మాట చెప్పారు. ఎమ్మెల్యే కౌన్సిలర్లను సముదాయించినా పరిస్థితి మాత్రం నివురుగప్పిన నిప్పులాగే ఉంది.
జగిత్యాలలో అవిశ్వాసం కంటే ముందే రాజీనామా చేశారు చైర్‌పర్సన్ భోగ శ్రావణి. అయితే ఎమ్మెల్యే ఇబ్బంది పెడుతున్నారంటూ ఆరోపించారు శ్రావణి. ఆమె రాజీనామాను జిల్లా కలెక్టర్ ఆమోదించారు. ప్రస్తుతం కొత్త చైర్ పర్సన్ కోసం అభిప్రాయ సేకరణ మొదలు పెట్టారు ఎమ్మెల్యే. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మున్సిపల్ చైర్మన్‌లకు అవిశ్వాస గండం పట్టుకుంది. యాదగిరిగుట్ట, చండూరు మున్సిపాలిటీల్లో వివిధ పార్టీల కౌన్సిలర్లు ఆయా జిల్లాల కలెక్టర్లను కలిసి అవిశ్వాసం పెట్టాలని కోరారు. ఇదే అదనుగా మరి కొన్నింటిలోనూ అసంతృప్తులు అవిశ్వాసం దిశగా పావులు కదుపుతున్నారు.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి