Telangana Congress: ఢిల్లీకి సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ పంచాయితీ..! ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేతల కీలక సమావేశం..

పదవుల లొల్లితో.. తెలంగాణ కాంగ్రెస్‌ పంచాయతీ వీధికెక్కింది. సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ అన్నట్టుగా పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ పార్టీలో నెలకొన్న అంతర్గత సమస్యలు, గ్రూప్‌ తగాదాలకు పరిష్కారం హైకమాండ్‌ చూపిస్తుందా?

Telangana Congress: ఢిల్లీకి సీనియర్స్ వర్సెస్ జూనియర్స్ పంచాయితీ..! ఇవాళ కాంగ్రెస్ సీనియర్ నేతల కీలక సమావేశం..
Telangana Congress

Updated on: Dec 20, 2022 | 6:56 AM

తెలంగాణ కాంగ్రెస్ పంచాయితీ ఢిల్లీకి చేరింది. పదవుల కేటాయింపులపై సీనియర్ల విమర్శలు, గ్రూప్ రాజకీయాలు, అంతర్గత విభేధాలపై హైకమాండ్ ప్రత్యేక దృష్టి సారించింది. ప్రియాంక గాంధీ ఏఐసీసీ సెక్రటరీ నదీమ్‌కు ఫోన్ చేసి తెలంగాణ కాంగ్రెస్లో గత కొద్ది రోజులుగా జరుగుతున్న పరిణామాలను ఆరా తీశారు. సీనియర్లకు-రేవంత్ వర్గానికి మధ్య విభేదాలకు కారణాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్లతో త్వరలో భేటి అయ్యే అవకాశం కూడా ఉంది. ఇక చెప్పినట్టే సమావేశానికి దూరంగా ఉన్న సీనియర్ కాంగ్రెస్ నేతలు కూడా.. వాట్ నెక్స్ట్ అన్న అంశంపై సీరియస్‌గా దృష్టి పెట్టారు. ఇదే విషయంపై చర్చించేందుకు ఇవాళ మహేశ్వరరెడ్డి ఇంట్లో భేటీ కానున్నారు. అంతేకాదు రేపు ఢిల్లీ వెళ్లే యోచనలో కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

కాంగ్రెస్‌లో ఇలాంటి విభేదాలు సర్వ సాధారమని జీవన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ సమస్యలను ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తానన్న ఆయన ఈ విభేదాలు తాత్కాలికమేనని, రేవంత్ రెడ్డి పాదయాత్రను స్వాగతిస్తున్నానని చెప్పారు. అటు కాంగ్రెస్ సీనియర్లు బీజేపీలోకి రావాలంటూ ఆహ్వానం పలికిన రాజగోపాల్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు రేవంత్ వర్గానికి చెందిన సీనియర్ నేత మల్లు రవి. కక్కూర్తి పడి కాంగ్రెస్ పార్టీకి ద్రోహం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు.

పార్టీలో ఉంటూ సీనియర్లను ఆధారాలు లేకుండా కోవర్టులు అనడం తప్పని శ్రీధర్ బాబు వ్యాఖ్యానించారు. పీసీసీ, సీఎల్పీలను అధిష్టానం అనుక్షణం గమనిస్తోందని, తప్పొప్పులు బయటకు తెలియాల్సినవసరం ఉందని అభిప్రాయపడ్డారు. మొత్తానికి ఈ లుకలుకలకు ఎండ్‌ కార్డ్‌ ఎప్పుడు పడుతుందో చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..