Telangana: కాంగ్రెస్‌లో కన్‌ఫ్యూజన్‌.. మాజీ మంత్రి సీటుకు ఎసరు.? హీట్ పెంచుతోన్న NRI పాలిటిక్స్..

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో టికెట్ వార్ ముదురుతోంది. ఎప్పటినుంచో పార్టీలో ఉన్న నేతలు టికెట్లపై ఆశలు పెట్టుకుంటే.. కొన్నిచోట్ల కొత్త నేతలొచ్చి వాలిపోతున్నారు. ముందే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించి ఆశావహుల కలలకు కళ్లెంవేశారు కేసీఆర్‌. కానీ మిగిలినపార్టీల్లో కొత్త కొత్త సమీకరణాలతో..

Telangana: కాంగ్రెస్‌లో కన్‌ఫ్యూజన్‌.. మాజీ మంత్రి సీటుకు ఎసరు.? హీట్ పెంచుతోన్న NRI పాలిటిక్స్..
Telangana Congress

Updated on: Sep 21, 2023 | 8:00 PM

హైదరాబాద్, సెప్టెంబర్ 21: మాజీ మంత్రి కొండా సురేఖ సీటుకు ఎసరు పెట్టిందెవరు? ఆమె ఎందుకంత హైరానా పడుతున్నారు? ప్యారాచూట్ నేతలన్న బిరుదులు సీట్లు చేజారతాయన్న భయంతోనేనా? వరంగల్ కాంగ్రెస్‌లో హీట్ పెంచుతున్నాయ్‌ NRI పాలిటిక్స్.

ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ కాంగ్రెస్ పార్టీలో టికెట్ వార్ ముదురుతోంది. ఎప్పటినుంచో పార్టీలో ఉన్న నేతలు టికెట్లపై ఆశలు పెట్టుకుంటే.. కొన్నిచోట్ల కొత్త నేతలొచ్చి వాలిపోతున్నారు. ముందే బీఆర్‌ఎస్‌ అభ్యర్థులను ప్రకటించి ఆశావహుల కలలకు కళ్లెంవేశారు కేసీఆర్‌. కానీ మిగిలినపార్టీల్లో కొత్త కొత్త సమీకరణాలతో గందరగోళం పెరుగుతోంది. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీలో అభ్యర్థులపై కసరత్తు జరుగుతోంది. ఆశావహులు టెన్షన్‌తో అగ్రనేతల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తున్నారు. ఒక్కో నియోజకవర్గంలో టికెట్‌కోసం ఐదు నుంచి ఇరవైమందిదాకా దరఖాస్తు చేసుకున్నారు.

కాంగ్రెస్‌ టికెట్ల వేటలో వరంగల్ తూర్పు నియోజకవర్గం హాట్ హాట్ చర్చగా మారింది.. ఇప్పటికే ఇక్కడి నుంచి పోటీకి సిద్ధమవుతున్న మాజీ ఎమ్మెల్యే కొండా సురేఖ సీటు తనదేనన్న ధీమాతో ఉన్నారు. 2014లో వరంగల్ తూర్పు నుంచి గెలిచిన కొండా సురేఖ 2018లో తన పూర్వ నియోజకవర్గం పరకాల నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈసారి వరంగల్ తూర్పు నుంచి పోటీకి మళ్ళీ సిద్దమవుతున్నారు. అయితే తూర్పు నియోజకవర్గం టికెట్‌ కోసం కాంగ్రెస్‌లో 8 మంది నేతలు దరఖాస్తు చేసుకున్నారు..

వరంగల్‌ తూర్పు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ టికెట్‌కోసం దరఖాస్తు చేసుకున్నవారిలో NRI ప్రదీప్ సామల అందరికంటే ఎక్స్‌పోజ్‌ అవుతున్నారు. వరంగల్ తూర్పు టికెట్‌కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రదీప్‌. వరంగల్ గిర్మాజీపేట ప్రాంతానికి చెందిన ప్రదీప్ సామల 27ఏళ్లక్రితం అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. నాటా, ఆటాలో కీలక బాధ్యతలు నిర్వహించిన ఆయన ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నారు. కాంగ్రెస్‌ అగ్రనేతలతో పాటు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డితో ఆయనకు మంచి సంబధాలున్నాయి. పక్కాలోకల్‌నంటూ తూర్పు టికెట్‌పై గురిపెట్టారు ఈ ఎన్నారై. తన సీటుకి కొందరు పోటీకొస్తుండటంతో కొండా సురేఖ అసహనంతో రగిలిపోతున్నారు.

వృత్తిరీత్యా అమెరికాలో స్థిరపడ్డా తాను ఓరుగల్లు బిడ్డనే అంటున్నారు ప్రదీప్‌ సామల. వరంగల్ గడ్డ నా అడ్డా అంటూ కాంగ్రెస్‌ తనకే అవకాశం ఇస్తుందన్న విశ్వాసంతో ఉన్నారు. ఈ ప్రవాస భారతీయుడికి ఇప్పుడు ప్రజాప్రతినిధి కావాలన్న తాపత్రయం పెరిగిపోయింది. సీనియర్ నాయకురాలు, మాజీ మంత్రి సీటుపైనే గురిపెట్టారు కాంగ్రెస్‌ ఎన్నారై. ప్రస్తుతం వరంగల్ తూర్పు కాంగ్రెస్‌లో టికెట్‌ కొండా కుటుంబానికేనా.. మరొకరికా అన్న చర్చ జరుగుతోంది. కొండా దంపతులు ఐదేళ్లకోసారి నియోజకవర్గాలు మారుస్తూ స్థిరత్వం లేక పోవడంతో పార్టీ కేడర్‌తో పాటు వారి అనుచరులు కూడా అయోమయంలో ఉన్నారు.

ప్రవాస భారతీయులకు హఠాత్తుగా సొంత గడ్డపై ప్రేమ పెరగడం… ఇక్కడ ప్రజాప్రతినిధి కావాలని తాపత్రయంతో పోటీకి సిద్ధమవుతుండడం జనంలో చర్చగా మారింది.. వరంగల్ తూర్పులో ప్రదీప్ గట్టి ప్రయత్నాలు చేస్తుంటే పాలకుర్తిలో కూడా NRIలు పోటీపడుతున్నారు. ఝాన్సీరెడ్డి, తిరుపతిరెడ్డి కాంగ్రెస్‌ టికెట్‌ రేసులో ఢీ అంటే ఢీ అంటున్నారు. ఓరుగల్లు జిల్లాలో ఎన్నారై పాలిటిక్స్‌ అందరి దృష్టినీ ఆకర్షిస్తుంటే.. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు పీక్ స్టేజ్‌కి చేరింది.