AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

హస్తినలో హైటెన్షన్.. తెలంగాణ కేబినెట్ మార్పులపై ఆసక్తికర పరిణామాలు.. జరిగేది అదేనా..?

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు వేడెక్కాయి. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో కేసీ వేణుగోపాల్‌తో కీలక భేటీ నిర్వహించగా, కేబినెట్ విస్తరణ, శాఖల మార్పులు, నామినేటెడ్ పోస్టులు, మంత్రి కొండా సురేఖ వ్యవహారంపై చర్చ జరిగినట్లు సమాచారం. ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో తెలంగాణ నేతల వరుస భేటీల నేపథ్యంలో హైకమాండ్ నిర్ణయాలపై ఉత్కంఠ నెలకొంది.

హస్తినలో హైటెన్షన్.. తెలంగాణ కేబినెట్ మార్పులపై ఆసక్తికర పరిణామాలు.. జరిగేది అదేనా..?
Telangana Congress
Prabhakar M
| Edited By: |

Updated on: Sep 02, 2026 | 8:13 AM

Share

తెలంగాణ కాంగ్రెస్‌లో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌కు చెందిన కీలక నేతలు ఢిల్లీలో వరుస భేటీలకు సిద్ధమవుతుండటంతో పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ముఖ్యంగా మంత్రివర్గంలో మార్పులు, శాఖల పునర్వ్యవస్థీకరణతో పాటు మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఇప్పుడు హైకమాండ్ దృష్టికి చేరినట్లు తెలుస్తోంది.

కేసీ వేణుగోపాల్‌తో రేవంత్ కీలక భేటీ

మంగళవారం ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. రాత్రి కాంగ్రెస్ అగ్రనేత, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను ఆయన నివాసంలో కలిశారు. సుమారు గంటపాటు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం.

వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలన, ప్రభుత్వ పనితీరు, పార్టీలోని అంతర్గత పరిణామాలతో పాటు కొండా సురేఖ వ్యవహారం ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీకి, ప్రభుత్వానికి కలిగించిన ఇబ్బందులపైనా చర్చ జరిగినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మంత్రుల పనితీరుపై సీఎం నివేదిక

మంత్రుల పనితీరుపైనా సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్‌కు వివరాలు అందించినట్లు సమాచారం. శాఖల వారీగా మంత్రుల పనితీరు, వారి వ్యవహారశైలి, పార్టీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం వంటి అంశాలను వివరించినట్లు తెలుస్తోంది.

అదే సమయంలో కేబినెట్‌లో చోటు కోసం ఎదురుచూస్తున్న నేతల పేర్లపైనా చర్చ జరిగినట్లు సమాచారం. సీనియర్ నేతలతో పాటు యువ నాయకులకు అవకాశం కల్పించే అంశాన్ని కూడా సీఎం ప్రస్తావించినట్లు తెలుస్తోంది.

శాఖల మార్పుపైనా చర్చ

ప్రస్తుత మంత్రులకు కేటాయించిన శాఖల్లో మార్పులు చేయాలా? మరికొంత మందికి కొత్త బాధ్యతలు అప్పగించాలా? అనే అంశంపైనా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మంత్రివర్గ విస్తరణతో పాటు నామినేటెడ్ పోస్టుల భర్తీ అంశం కూడా సమావేశంలో ప్రస్తావనకు వచ్చినట్లు సమాచారం.

ఎప్పటి నుంచో పార్టీ కోసం పనిచేస్తున్న నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలనే ఆలోచనపై కూడా చర్చ జరిగినట్లు కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి.

కొండా సురేఖ అంశంపై హైకమాండ్ ఫోకస్

మంత్రి కొండా సురేఖ వ్యవహారం ఢిల్లీ రాజకీయాల్లో ప్రధాన చర్చగా మారింది. పార్టీ క్రమశిక్షణా కమిటీ ఈ అంశంపై విచారణ జరిపి రూపొందించిన నివేదికను ఇప్పటికే హైకమాండ్‌కు అందించినట్లు తెలుస్తోంది.

పార్టీ లైన్‌కు భిన్నంగా నేతలు చేస్తున్న వ్యాఖ్యలు భవిష్యత్తులో పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బందులు తెచ్చే అవకాశం ఉందనే అభిప్రాయాన్ని సీఎం రేవంత్ రెడ్డి కేసీ వేణుగోపాల్ వద్ద వ్యక్తం చేసినట్లు సమాచారం.

నేడు వరుస భేటీలు

బుధవారం ఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలతో తెలంగాణ నేతల భేటీలు జరగనున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ సమావేశం కానున్నట్లు తెలుస్తోంది.

అదే సమయంలో కేసీ వేణుగోపాల్‌తో మీనాక్షి నటరాజన్, మహేశ్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీలో కొండా సురేఖ వ్యవహారంతో పాటు రాష్ట్ర కాంగ్రెస్‌లో తాజా పరిణామాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.

ఖర్గే, కేసీతో కొండా సురేఖ భేటీ

మంత్రి కొండా సురేఖ కూడా కాంగ్రెస్ అగ్రనేతలను కలవనున్నారు. ఖర్గే, కేసీ వేణుగోపాల్‌తో ఆమెకు అపాయింట్‌మెంట్ లభించినట్లు తెలుస్తోంది. తనపై వచ్చిన ఆరోపణలు, పార్టీ క్రమశిక్షణా కమిటీ నివేదిక అంశాలపై ఆమె హైకమాండ్‌కు వివరణ ఇచ్చే అవకాశం ఉంది.

దీంతో రేవంత్ రెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకత్వం ఒకవైపు.. కొండా సురేఖ మరోవైపు హైకమాండ్‌తో సమావేశం కానుండటం తెలంగాణ కాంగ్రెస్‌లో ఆసక్తిని పెంచుతోంది.

మంత్రి పదవుల కోసం ఆశావహుల ప్రయత్నాలు

మరోవైపు కేబినెట్‌లో చోటు కోసం ఆశిస్తున్న నేతలు ఢిల్లీ స్థాయిలో తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు పలువురు నాయకులు ఇప్పటికే కాంగ్రెస్ పెద్దలను కలిసి తమకు అవకాశం కల్పించాలని కోరినట్లు సమాచారం.

స్పీకర్ గడ్డం ప్రసాద్, ఎమ్మెల్సీ విజయశాంతి సహా పలువురు నేతలు కూడా అధిష్ఠానం పెద్దలతో భేటీ అయినట్లు తెలుస్తోంది.

హైకమాండ్ నిర్ణయంపైనే ఉత్కంఠ

తెలంగాణ కాంగ్రెస్‌లో జరుగుతున్న తాజా పరిణామాల నేపథ్యంలో కేబినెట్‌లో మార్పులు, శాఖల పునర్వ్యవస్థీకరణ, కొత్తగా మంత్రి పదవుల భర్తీ, నామినేటెడ్ పోస్టుల కేటాయింపు వంటి అంశాలపై హైకమాండ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.

మరోవైపు కొండా సురేఖ వ్యవహారంపై ఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు ఆమె ఇచ్చే వివరణపైనా పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. వరుస భేటీల అనంతరం ఢిల్లీ నుంచి తెలంగాణ కాంగ్రెస్‌కు సంబంధించి కీలక నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.

మరిన్ని తెలంగాణ వార్తల వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us