CM Revanth Reddy: హడ్కో చైర్మన్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ రిక్వెస్ట్.. ఏంటో తెలుసా?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠ సమావేశం అయ్యారు. తెలంగాణలో జరుగుతున్న కీలక అభివృద్ధి కార్యక్రమాలకు తక్కువ వడ్డీ రేటుతో దీర్ఘకాలిక రుణాలు అందించాలని సీఎం రేవంత్ రెడ్డి ఆయన్ను కోరారు. సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర ప్రగతికి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి.

CM Revanth Reddy: హడ్కో చైర్మన్‌కు సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ రిక్వెస్ట్.. ఏంటో తెలుసా?
Telangana Cm Revanth Reddy

Edited By: Anand T

Updated on: Dec 01, 2025 | 2:26 PM

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్ల నిర్మాణం తదితర ప్రాజెక్టుల కోసం తక్కువ వడ్డీరేటుతో రుణాలు అవసరమని సీఎం రేవంత్ రెడ్డి హడ్కో చైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠకు తెలిపారు. భవిష్యత్ కనెక్టివిటీకి కీలకమైన భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూరు అమరావతి మీదుగా చెన్నై వరకు నిర్మించనున్న గ్రీన్ ఫీల్డ్ కారిడార్, బందరు పోర్ట్‌కు వెళ్లే గ్రీన్‌ఫీల్డ్ రహదారి, అలాగే బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుపై కూడా ఇరువురు విస్తృతంగా చర్చించారు.

గత ప్రభుత్వంలో అధిక వడ్డీరేటుతో ఇచ్చిన రుణాల కారణంగా రాష్ట్రంపై పెరిగిన భారాన్ని తగ్గించే దిశగా లోన్ రీకన్‌స్ట్రక్షన్ అవసరాన్ని సీఎం ప్రస్తావించారు. ఈ సూచనపై హడ్కో చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. వేగంగా అభివృద్ధి చెందుతున్న తెలంగాణ రాష్ట్రానికి మరింత అనుకూల రుణ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్టు ఆయన సంకేతాలిచ్చారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే రుణాలు మంజూరయ్యాయని హడ్కో చైర్మన్ వెల్లడించగా, మిగిలిన మరిన్ని 10 లక్షల ఇళ్ల నిర్మాణానికి కావాల్సిన రుణాలను త్వరితగతిన ఆమోదించాల్సిందిగా సీఎం కోరారు. ఈ అంశంపై కూడా హడ్కో చైర్మన్ సానుకూలంగా స్పందించారు. అలాగే ఈ నెల 8, 9 తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో జరగనున్న భారత్ గ్లోబల్ సమ్మిట్‌కు హడ్కో చైర్మన్‌ను సీఎం రేవంత్ రెడ్డి ఆహ్వానించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.